బిలియనీర్ యుసాకూ మేజావా ఎనిమిది మంది ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ ఫ్లైట్‌లో చంద్రుడిపైకి తనతో రావొచ్చని ప్రజలకు పిలుపునిచ్చారు. విభిన్న నేపథ్యాల నుంచి వచ్చిన ప్రజలు అయితే ఇంకా మంచిదని అంటూ ఆయన ట్విటర్‌లో ఒక వీడియో విడుదల చేశారు. ప్రజలు దరఖాస్తు చేసుకోవడానికి వీలుగా ఒక లింక్ కూడా షేర్ చేశారు. తనతో వచ్చే వారి ఖర్చులన్నీ తానె భరిస్తానని, చంద్రుడిపైకి వచ్చేవారు ఎవరైనా సరే వారి ప్రయాణం పూర్తిగా ఉచితం అని ప్రకటించారు. ఈ మిషన్ కు ‘డియర్ మూన్’ అని పేరు పెట్టారు. ఈ మిషన్ లో భాగంగా ౨౦౨౩ లో చంద్రుడిపైకి వెళ్తారు. ఈ యాత్రలో సీట్లు అన్నిటిని తానె కొన్నానని, కాబట్టి తనతో వచ్చేవారికి ఇది ఉచితం అవుతుందని చెప్పారు.

అసలు మేజావా ఎవరు?


మేజావా జపాన్‌లో పేరుమోసిన బిలియనీర్, ఫ్యాషన్ కి రారాజు. గొప్పగొప్ప కళాఖండాలన్నీ ఆయన సేకరిస్తారు. అలాగే మొదట కళారంగానికి చెందినవారినే ఆయన తీసుకెళ్లాలనుకున్నప్పటికీ ఆ తరువాత ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా రావొచ్చని ఆహ్వానించారు. గత ఏడాది ఆయన ఈ యాత్రలో తనతో పాటు వచ్చేందుకు ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలనీ కోరారు. ఇప్పుడు స్పేస్ ఎక్స్‌లో చంద్రుడిపైకి వెళ్లేందుకు ఆయన 2018లో టికెట్ బుక్ చేసుకున్నారు.. దాంతో ఆ యాత్రకు వెళ్తున్న తొలి ప్రైవేట్ యాత్రికుడిగా ఆయన గుర్తింపు పొందారు. ఆయన ఈ టికెట్ ఎంత ధరకు కొన్నారన్నది బహిరంగంగా వెల్లడి చేయనప్పటికీ ఎలాన్ మస్క్కు మాత్రం మేజావా చాలా పెద్ద మొత్తం చెల్లించారని గతంలో చెప్పారు. 1972 తరువాత చేపట్టబోయే ఈ మిషన్ 2023లో చంద్రుడిపైకి చేరుకుంటున్న తొలి మానవ సహిత యాత్ర.