విజయనగరం జిల్లా గుర్లలో రోడ్డు ప్రక్క తుప్పల్లో ఒక అమ్మాయి కాళ్ళు, చేతులను కట్టేసి ఉన్నట్లుగా మార్చి 1, ఉదయం గుర్ల పోలీసులకు వచ్చిన సమాచారం సంగతి అందరికి తెలిసిందే! ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్న గుర్ల ఎస్ఐ నీలావతి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్న నేపథ్యంలో ఈ సంఘటనను తీవ్రంగా పరిగణించిన జిల్లా ఎస్పీ ఈ కేసు దర్యాప్తును దిశ మహిళా పోలీసు స్టేషనుకు అప్పగించి, డిఎస్పీ శ్రీ టి.త్రినాధ్ గార్ని దర్యాప్తు చేయాల్సిందిగా ఆదేశించడంతో మహిళా పిఎస్ డిఎస్పీ త్రినాథ్ తో పాటు విజయనగరం డిఎస్పీ అనిల్ కుమార్, విజయనగరం రూరల్ సిఐ మంగవేణి, నీలావతి, పి.నారాయణరావులు వివిధ బృందాలుగా ఏర్పడి జిల్లా ఎస్పీగారి స్వీయ పర్యవేక్షణలో ఫిర్యాది చెప్పిన వివరాల ప్రకారం సాక్ష్యాధారాలను సేకరించారు.

చివరికి ఫిర్యాదు చేసిన యువతి తనకు తెలిసిన స్నేహితుడిని కలవడానికి ఫిబ్రవరి 27న హాస్టల్ నుండి బాబాయ్ దగ్గరకు వెళతానని అబద్దం చెప్పి పర్మిషన్ తీసుకొని బయటకు వెళ్ళినట్లుగా హాస్టల్ సిబ్బంది చెప్పారు. అదే సమయంలో హాస్టల్ లో తన అన్నయ్య తన గురించి వాకబు చేసారన్న విషయం తెలుసుకున్న అమ్మాయి, తన స్నేహితుడిని కలిసిన తర్వాత తిరుగు ప్రయాణంలో ఒక ప్రైవేటు ట్రావెల్స్ కు చెందిన పాలకొల్లు-పాలకొండ బస్సు ఎక్కి గుర్ల దాటిన తరువాత బస్సు దిగిన ఆమె గుర్ల రోడ్డు ప్రక్కన ఉన్న తుప్పల్లోకి వెళ్ళి తన కుటుంబ సభ్యులు, స్నేహితులను నమ్మించేందుకుగాను తనకు తానే కాళ్ళు, చేతులను చున్నీతో కట్టుకొని, అపస్మారక స్థితిలో పడి ఉన్నట్లుగా నాటకం ఆడినట్లు ఆమె అంగీకరించినట్లుగా తెలిపారు. ఈ కేసు విచారణను సమర్ధవంతంగా పనిచేసి, 48 గంటల్లో ఛేదించి, వాస్తవాలను వెలికితీసారని, వారిని అభినందిస్తున్నట్లుగా జిల్లా ఎస్పీ బి. రాజకుమారి తెలిపారు.