కర్ణాటక రాష్ట్రం కొడగు జిల్లా కనూరు గ్రామంలో మద్యం సేవించిన ఆకతాయి ఒక ఇంటికి బయట నుండి తాళం వేసి నిప్పు అంటించడంతో 8 మంది మంటల్లో చిక్కుకున్నారు. వీరిలో ముగ్గురు సజీవ దహనమయ్యారు. మిగిలిన ఐదుగురు తీవ్ర గాయాలపాలు అవ్వడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. కానీ ముగ్గురు చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. మృతిచెందిన వారిలో నలుగురు చిన్నారులు ఉండడం అందరిని కలచివేస్తుంది.

ఈ ఘటనలో నిప్పంటించిన వ్యక్తిని బోజా(50)గా గుర్తించారు. బాధిత కుటుంబానికి బోజాతో వివాదాలు ఉండడంతో ఇలాంటి పనికి పాల్పడి ఉంటాడని స్థానికుల సమాచారం. కాగా బోజా పరారీలో ఉన్నాడు. సమాచారం అందుకొన్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.