హైదరాబాద్ జిల్లా పరిధిలో ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న టీచర్లు, ఆయాల పోస్టుల భర్తీకి అయిదు ఐసీడీఎస్ ప్రాజెక్టుల వారీగా ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో వివరాలు సేకరించారు. దానికి సంబంధించిన నివేదికను సిద్ధం చేసి జిల్లా కలెక్టర్కు ఆమోదానికి పంపించారు. జిల్లా పరిధిలో సమగ్ర శిశు అభివృద్ధి పథకం(ఐసీడీఎస్) కింద అయిదు ప్రాజెక్టులున్నాయి. జిల్లాలోని చార్మినార్, గోల్కొండ, ఖైరతాబాద్, నాంపల్లి, సికింద్రాబాద్లోని ఆయా ప్రాజెక్టుల పరిధిలో ప్రధాన అంగన్వాడీ కేంద్రాలు 912 ఉండగా.. మినీ కేంద్రాలు రెండు ఉన్నాయి. ప్రస్తుతం వీటీలో 870 మంది టీచర్లతో పాటు ఒక మినీ టీచర్ పనిచేస్తుండగా.. 780 మంది ఆయాలు పనిచేస్తున్నారు. దీంతో 42మంది టీచర్లతో పాటు ఒక మినీ టీచర్ పోస్టుతో పాటు 132 మంది ఆయాల పోస్టులు ఖాళీగా ఉన్నట్టు గుర్తించిన అధికారులు వాటిని భర్తీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తారని వెల్లడించారు.