ఇంటర్మీడియట్ విద్యాశాఖలో అక్రమ పోస్టింగ్ వ్యవహారం అంతా ఇప్పుడు బయటపడింది. విదేశాలకు వెళ్లి 17 ఏళ్లుగా ఒక్కసారి కూడా డ్యూటీకి రాని ఒక మహిళా అధ్యాపకురాలికి ఇంటర్ విద్యాశాఖ పోస్టింగ్ ఇవ్వడం వివాదాస్పదంగా మారింది. ఇంటర్ విద్యా శాఖ వరంగల్ ఆర్జేడీ జయప్రదబాయి ప్రభుత్వానికి ఫైలు పంపించకుండా, ఎలాంటి ఆమోదం పొందకుండా ఈ పోస్టింగ్ ఇవ్వడమే కాకుండా ఇంటర్ విద్యా కమిషనరేట్ ఆదేశాల మేరకు నియమిస్తున్నట్టుగా పేర్కొనడం గమనార్హం. వాస్తవానికి ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా, సెలవు పెట్టకుండా విధులకు హాజరు కాకపోవడం తప్పు. అంతేకాక ప్రభుత్వ ఆమోదం లేకుండా విదేశాలకు వెళ్లినవారికి పోస్టింగ్ ఇవ్వడం నిబంధనలకు విరుద్ధం. అయినా పోస్టింగ్ ఇవ్వడం పట్ల తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
2007 జూన్ 1న జారీ చేసిన జీవో 128 ప్రకారం ఏ ప్రభుత్వ ఉద్యోగి, అధికారి అయినా ఒక ఏడాదికి మించి విధులకు గైర్హాజరైనా, అసలు సెలవు పెట్టినా, పెట్టకపోయినా ఐదేళ్ల కంటే ఎక్కువ కాలం విధులకు హాజరుకాకున్నా సదరు ఉద్యోగానికి రాజీనామా చేసినట్టే పరిగణించాలి. ఈ క్రమంలోనే.. ముందస్తు సమాచారం ఇవ్వకుండా విధులకు రాని 56 మంది అధ్యాపకులను ఇంటర్ విద్యాశాఖ 2011లో తొలగించింది. అందులో ఈ అధ్యాపకురాలు కూడా ఉన్నారు.
అమెను విధుల్లోంచి తొలగించినట్టు నమోదు చేసిన ఫైలును కూడా మాయం చేసి మరీ పోస్టింగ్ ఇవ్వడంతో నిబంధనలకు విరుద్ధంగా ఇలా ఎలా పోస్టింగ్ ఇచ్చారన్నది వివాదాస్పదంగా మారింది. ప్రభుత్వానికి ఫైలు పంపించి ఆమోదం తీసుకోకుండా పోస్టింగ్ ఇవ్వడం, ఎన్నాళ్ల నుంచి విధులకు రావట్లేదన్న వివరాలు పొందుపర్చకుండానే ఆమెను విధుల్లో చేర్చుకోవాలంటూ ఉత్తర్వులు జారీ చేయడంపై పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాజీనామా చేసిన ఒక ఉద్యోగిని మళ్లీ విధుల్లోకి తీసుకోవాలంటే ప్రత్యేక కేసు కింద ముఖ్యమంత్రి మాత్రమే అనుమతిచ్చే అవకాశం ఉంటుంది. అలాంటిది అధికారులు నేరుగా ఎలా పోస్టింగ్ ఇచ్చారని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీంతో ఇప్పుడు ఈ వివాదంపై విచారణ జరుగుతుంది.