ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం అంతకంతకూ ఉధృతమవుతూ ఉంది. రానున్న ఆరు గంటల్లోనే ఇది తుపానుగా మారనుంది. దీనికి జవాద్‌గా పేరు పెట్టారు. ప్రస్తుతం ఇది విశాఖకు 480 కి.మీ, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 600 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. గంటకు 30 కి.మీ వేగంతో ఇది పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తోంది. రేపు ఉదయానికి ఉత్తరాంధ్ర- ఒడిశా తీరానికి దగ్గరగా వచ్చే అవకాశముందని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్‌ కన్నబాబు తెలిపారు. దీని ప్రభావంతో ఇవాళ ఉత్తరాంధ్రలో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అవకాశం ఉండగా, అక్కడక్కడా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని ఆయన చెప్పారు.

ఇవాళ అర్ధరాత్రి నుంచి తీరం వెంబడి గంటకు 45-65 కి.మీ వేగంలో ఈదురుగాలులు వీచే అవకాశముందన్నారు. రేపు ఉదయం నుంచి 80-90కి.మీ వేగంలో బలమైన గాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మత్స్యకారులు సోమవారం వరకు చేపలవేటకు వెళ్లరాదని తెలిపారు. భారీ వర్ష సూచన నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పొంగి ప్రవహించే కాలువలు, ప్రవాహాలు, ఇతర నీటి పారుదల మార్గాలను తెలుసుకుని జాగ్రత్తగా ఉండాలని, రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తుపాను సహాయక చర్యల కోసం ఇప్పటి వరకు 11 ఎన్డీఆర్‌ఎఫ్‌, 4 ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలను సిద్ధం చేసినట్లు, అదనంగా మరో 4 బృందాలను అందుబాటులో ఉంచామన్నారు.

తుపాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు జీవీఎంసీ, పోలీస్‌, రెవెన్యూ, ఇరిగేషన్‌ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని విశాఖ జిల్లా కలెక్టర్‌ మల్లికార్జున అధికారులకు సూచించారు. తుపాను ప్రభావంతో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. తుపాను సహాయక చర్యల కోసం 66 మంది ఎన్డీఆర్‌ఎఫ్‌, 55 ఎస్డీఆర్‌ఎఫ్‌ సభ్యులను సిద్ధం చేసినట్లు చెప్పారు. మరోవైపు విశాఖ కలెక్టరేట్లో కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశారు. 0891-2590100, 0891-2590102, 0891-2750089, 0891-2750090, 0891-2560820 నంబర్లతో కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశామని.. సహాయం కోసం ఈ నంబర్లకు ఫోన్‌ చేయొచ్చని జిల్లా అధికారులు తెలిపారు.

శ్రీకాకుళం కలెక్టరేట్‌లో ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌ సమీక్ష నిర్వహించారు. తుపాను నేపథ్యంలో చేపట్టాల్సిన ముందస్తు చర్యలపై జిల్లా కలెక్టర్‌, ఇతర ఉన్నతాధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు. జిల్లాలోని 11 మండలాల్లో తుపాను తీవ్రత ఉండే అవకాశముందన్నారు. విద్యుత్‌ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని తాగునీటిని ముందుగానే సిద్ధం చేసుకోవాలని సూచించారు.