20 ఏళ్లుగా నకిలీ వైద్య సర్టిఫికెట్లు సృష్టించి వైద్యుడిగా చలామణి అవుతున్న ఒక వ్యక్తిని ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేసారు. ముంబైలోని కందివాలి వెస్ట్ ప్రాంతం గాంధీనగర్ లోని క్యాండీ కాంపౌండ్ లో “షమ క్లినిక్” పేరుతో ఆసుపత్రిని నడుపుతున్న మసిహుద్దీన్ అబ్దుల్ హై ఖాన్ (45) అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసారు. ముంబై క్రైమ్ బ్రాంచ్ యూనిట్ 9కి వచ్చిన సమాచారం ప్రకారం మసిహుద్దీన్ నకిలీ డాక్టర్ పట్టాలు సృష్టించి స్థానికంగా ఆసుపత్రిని నెలకొల్పి వైద్యుడిగా చలామణి అవుతున్నాడు. గతంలో వచ్చిన ఫిర్యాదు ఆధారంగా నిందితుడిపై నిఘా పెట్టిన పోలీసులు ఆమేరకు అతని బండారాన్ని బయటపెట్టారు.

పోలీసులు ఈ ఆసుపత్రి పై దాడి నిర్వహించిన క్లినిక్ నుండి నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లు, మందులు మరియు వైద్య పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు మసిహుద్దీన్ అబ్దుల్ హై ఖాన్ ను ఐపిసి సెక్షన్ 419 మెడికల్ ప్రాక్టీషనర్ చట్టంలోని 35, 36 సెక్షన్లు సహా, సెక్షన్ 420 కింద అరెస్టు చేసి, తదుపరి దర్యాప్తు కోసం కందివాలి పోలీస్ స్టేషన్ కు అప్పగించారు. నిందితుడు పూర్తి వివరాలు పై దర్యాప్తు జరుపుతున్న పోలీసులు నకిలీ సర్టిఫికెట్లు ఎలా సంపాదించాడు? ఎవరి నుండి తీసుకున్నారు అనే విషయం కనిపెట్టే పనిలో ఉన్నారు.