టీకాలు కూడా వచ్చిన తర్వాత కరోనా ఇప్పుడు లాటిన్ అమెరికన్ దేశం బ్రెజిల్‌ను వణికిస్తోంది. వరుసగా అక్కడ రెండోరోజు కూడా రికార్డు స్థాయిలో మరణాలు నమోదు
కాగా, 1,910 మంది ఈ వైరస్‌కి బలయ్యారు. మరణాల పరంగా బ్రెజిల్ ప్రపంచంలోనే రెండో స్థానం ఆక్రమించింది. ప్రపంచ గణాంకాల ప్రకారం అమెరికాలో 5,31,652 మంది మృత్యు ఒడికిచేరుకోగా, బ్రెజిల్‌లో 2,59,402 మంది ప్రాణాలు వదిలారు. కరోనా మొదలైన ఇన్నిరోజులలో మొదటి సారి పరిస్థితి ఇంతకిందకు దిగజారిందని ప్రజారోగ్య సంస్థ ఫియోక్రజ్ హెచ్చరించింది. గత వారం నుంచి రోజుకు సగటున 1,331 మంది మృత్యువాత పడుతున్నా రు. ముందు రోజు 1,641 మరణాలు సంభవించాయి

మొదటి నుంచి కూడా కరోనా నియంత్రణలో బ్రెజిల్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఆ దేశ అధ్యక్షుడు జెయిర్ బొల్సొనారో వైరస్‌ను నిర్లక్ష్యం చేసి, నిపుణుల సూచనలు ఖాతరు చేయకుండా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. సెలవులు, కార్నివాల్స్ వంటి కారణాలే ఇప్పుడు అక్కడ కరోనా ఉద్ధృతికి కారణమయ్యాయి. అమెజాన్‌ రెయిన్ ఫారెస్ట్‌లో ఉద్భవించిన పీ1 అనే కొత్త వేరియంట్ కూడా తాజా ముప్పునకు కారణంగా నిపుణులు భావిస్తున్నారు. బ్రెజిల్లో మొత్తం 27 రాష్ట్రాలుండగా 17 రాష్ట్రాల్లో ఈ రకం కరోనా తన ఉనికిని చాటుతోంది. ఇది 10 కంటే ఎక్కువ దేశాలకు కూడా విస్తరించింది. అసలు దానికి కంటే ఈ ఉత్పరివర్తన చెందిన రకం ఇంకా వేగంగా వ్యాపిస్తోందని పరిశోధనలు పేర్కొన్నాయి. ఇప్పటికే కొవిడ్ నుంచి కోలుకొన్న వారికి కూడా ఇది వ్యాపిస్తుంది అని కొన్ని అధ్యయనాలు వెల్లడిస్తుండటం ఆ దేశాన్ని మరింత భయపెడుతుంది. అక్కడ వైద్య వ్యవస్థ కూడా నిస్సహాయ స్థితికి చేరుకుంది. ఇప్పటికే 19 రాష్ట్రాల్లో ఐసీయూలు 80 శాతానికి పైగా వినియోగంలో ఉన్నాయని ఫియోక్రజ్ వెల్లడించింది. ఆసుపత్రులు కిక్కిరిసిపోయి ఉండటంతో రోగులను పొరుగు ప్రాంతాలకు పంపించాల్సిన పరిస్థితి నెలకొనడం మరింత దురదృష్టకరం.

మిగతా దేశాలతో పోల్చుకుంటే బ్రెజిల్లో టీకా కార్యక్రమం కూడా ఆలస్యంగానే ప్రారంభమైంది. అదీకాక టీకాల కొరత కూడా వారిని వేధిస్తోంది. ప్రస్తుతం ఆ దేశం చైనా అభివృద్ధి చేసిన కరోనావాక్‌, ఆక్స్‌ఫర్డ్ టీకాలను వినియోగిస్తోంది. ఈ టీకాలను రెండు డోసులుగా ప్రజలకు అందించాల్సి ఉండగా, జనవరి మధ్యలో ప్రారంభమైన ఈ కార్యక్రమం కింద ఇప్పటికే 7.1 మిలియన్ల మందికి మొదటి డోసు అందగా, 2.1 మిలియన్ల మంది రెండో డోసును కూడా స్వీకరించారు. 212 మిలియన్లు కలిగిన ఆ దేశంలో..ఈ ఏడాది చివరి నాటికి అందరికి టీకాలు అందిస్తామంటూ ఆరోగ్యశాఖ మంత్రి చేసిన ప్రతిజ్ఞ నెరవేరడం దాదాపు అసాధ్యమని వైద్య నిపుణుల అభిప్రాయం.

దేశంలో కొత్త రకం ఉందని తెలుసు. ఈ విజృంభణను కట్టడి చేయాలంటే లాక్‌డౌన్ విధించాలి’ అని బ్రెజిల్‌లోని అంటువ్యాధుల నియంత్రణ సొసైటీకి చెందిన ఇసాబెల్లా అన్నారు. మరోవైపు ఈ వైరస్ కట్టడికి అక్కడి ఫెడరల్‌ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా లేదు. దానితో స్థానిక ప్రభుత్వాలే తమవంతుగా తాజాగా నియంత్రణ చర్యలకు శ్రీకారం చుట్టారు. ‘ఈ పరిస్థితికి మీ నిర్లక్ష్య వైఖరే కారణం. రోజుకు 1,000కి పైగా మరణాలు సంభవిస్తున్నాయి. ఒకేరోజు ఐదు విమానాలు కూలినప్పుడు కాట్రమే ఇంతమంది ప్రాణాలు వదలడం జరుగుతుంది . మీ పని మీరు సరిగా చేయకపోవడమే ఈ దుర్భర పరిస్థితికి కారణం’ అంటూ అధ్యక్షుడిపై విపక్ష నేత జావో డోరియా తీవ్రంగా మండిపడ్డారు