కరోనా కేసులు మళ్ళీ భారీగా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది.
గడిచిన 24 గంటల్లో ఒకేసారి 17,407 కొత్త కేసులు బయటపడ్డాయి. క్రితం రోజు(14,989 కేసులు)తో పోల్చుకుంటే నేడు భారీ తేడా కనిపించింది. ప్రస్తుతం మొత్తం వైరస్ కేసుల సంఖ్య 1.11 కోట్లకు పైబడింది. కానీ కాస్త ఊరటనిచ్చే అంశం ఏంటంటే మూడోరోజు కూడా మరణాల సంఖ్య 100కు దిగువనే నమోదు కావడం. కొత్తగా 89 మంది మృతి చెందగా, నిన్నటి వరకు 1,57,435 మంది కరోనా కారణంగా ప్రాణాలు వదిలారు.

ప్రస్తుతం దేశంలో 1,73,413 మంది కరోనాకు చికిత్స తీసుకుంటుండగా, క్రియాశీల రేటు 1.53 శాతంగా ఉంది. ఇక నిన్న ఒక్కరోజే 14,031 మంది కొవిడ్ నుంచి కోలుకోగా, ఇప్పటికి కరోనాను జయించిన వారు 1.08కోట్లకు పైగా ఉండగా ఆ రేటు 97.06 శాతంగా కొనసాగుతోంది. నిన్న ఒక్కరోజు 7,75,631 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు కేంద్రం తెలిపింది.

దేశంలో కరోనా టీకా కార్యక్రమం కొనసాగుతోంది, ఈ టీకా కార్యక్రమం ఇప్పటికే రెండో దశలోకి అడుగుపెట్టగా, మార్చి3 నాటికి 1,66,16,048 కోట్ల మందికి కేంద్రం టీకాలు పంపిణీ చేస్తే నిన్న ఒక్కరోజే 9,94,452 మంది టీకాలు వేయించుకున్నారు. అలాగే టీకా కోసం దేశవ్యాప్తంగా ఆసుపత్రుల్లో 60 ఏళ్ల పైబడిన వృద్ధుల రద్దీ భారీగా పెరగడంతో కేంద్రం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దానిలో భాగంగా ఇక నుంచి ప్రజలు24 గంటల్లో ఎప్పుడైనా కొవిడ్‌టీకా తీసుకునేందుకు వీలు కల్పిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.