మన దేశంలో పెట్రోల్ ధర తగ్గించాలంటే వీటిని జీఎస్‌టీ (వస్తు, సేవల పన్ను) పరిథిలోకి తీసుకొస్తే సరిపోతుందని ఎస్‌బీఐ ఆర్థికవేత్తలు అంటున్నారు. అయితే దీనికి రాజకీయ నాయకులు సిద్ధంగా లేరని ఆకారణంగానే దేశంలో ఇంధన ధరలు రికార్డు స్థాయిలో పెరిగిపోయాయని వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు.


కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన ఆదాయవనరులు పెట్రోలియం ఉత్పత్తులపై విధించే వ్యాట్, పన్నులు.అందుచేతనే చమురు ఉత్పత్తులను జీఎస్‌టీ పరిధిలోకి తేవాలన్న అంశం ఫై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా లేవు.ప్రస్తుతం పెట్రోల్‌, డీజిల్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. రవాణా ఛార్జీలు, డీలర్‌ కమిషన్‌, ఎక్సైజ్‌ సుంకం, సెస్‌, వ్యాట్‌ ఇలా పలు రకాల పన్నులు, ఛార్జీలు విధిస్తున్నాయి. అసలు లీటర్ పెట్రోల్ మీద ఎంత మొత్తం ప్రభుత్వానికి ఏ రూపంలో వెళ్తుంది? ఒక లీటర్ పెట్రోల్ పై రవాణా ఛార్జీలు రూ. 3.82, డీలర్‌ కమిషన్‌ రూ. 3.67, సెస్‌ రూ.30గా ఉంది. ఇక డీజిల్‌పై రవాణా ఛార్జీలు రూ. 7.25, డీలర్‌ కమిషన్‌ రూ. 2.53, సెస్‌, రూ. 20గా ఉంది. ఒకవేళ వీటిని జీఎస్‌టీ పరిధిలోకి తీసుకొస్తే అత్యధికంగా 28శాతం పన్ను ఉంటుంది. తద్వారా రాష్ట్రాలకు నష్టం తప్పదు. కానీ అలా తేవడం జరిగితే మాత్రం వినియోగదారులపై రూ.30 వరకు భారం తగ్గుతుంది. అప్పుడు లీటర్‌ పెట్రోల్‌ రూ. 75, లీటర్‌ డీజిల్‌ రూ. 68కే వస్తుంది’’అని సదరు ఆర్థికవేత్తలు వివరించారు.

ఇంధన ఉత్పత్తులను జీఎస్‌టీ కిందకు తీసుకొస్తే కేంద్ర, రాష్ట్రాలకు రూ.లక్ష కోట్ల నష్టం వస్తుందని, దేశ జీడీపీలో ఇది కేవలం 0.4శాతమేనని వారు వివరించారు. అంతేగాక, అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా దేశంలో ఇంధన ధరల్లో రోజువారీ మార్పులు చేయకుండా చమురు ధరలను స్థిరీకరించాలని ఆర్థికవేత్తలు సూచించారు. అలాగే అంతర్జాతీయ ధరలు తగ్గినప్పుడు వచ్చే లాభాలను, ధరలు పెరిగినప్పుడు వచ్చే లోటుతో పూడ్చుకోవాలన్నారు. ఆలా చేయడం ద్వారా వినియోగదారులపై తక్కువ భారం పడుతుందని వ్యక్తం చేశారు.