కేంద్ర ధర్మకర్తల బోర్డు సమావేశం గురువారం శ్రీనగర్‌లో జరుగగా వడ్డీరేటును ఖరారు చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ సంవత్సరం వడ్డీ రేటును తగ్గించే అవకాశం ఉందన్న ప్రచారం తొలుత జరిగినా గత సంవత్సరం ఉన్న రేటునే యథాతథంగా ఉంచారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2020-21)గానూ ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్‌) డిపాజిట్లపై వడ్డీరేటును 8.50 శాతంగా నిర్ణయించారు. కొవిడ్‌-19 ఉత్పన్నమైన పరిస్థితుల దృష్ట్యా చందాదారులు భారీగా నగదును ఉపసంహరించుకోవడంతో నగదు నిల్వలు తక్కువైపోయాయి. అదే సమయంలో డిపాజిట్లు కూడా తగ్గిపోయాయి.


గత సంవత్సరం డిసెంబర్ వరకు దాదాపు 2 కోట్ల మంది ఈపీఎఫ్‌వో వినియోగదారులు రూ.73వేల కోట్లను వెనక్కి తీసుకున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి (మార్చి 31) ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. 2018-19లో రూ.81వేల కోట్లను చందాదారులు వెనక్కి తీసుకోగా 2020-21లో అంతకుమించిన స్థాయిలో ఉపసంహరణలు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. గత ఏడాది డిసెంబరు వరకూ . 2019-20 సంవత్సరానికి వడ్డీ రేటును 8.5 శాతంగా ప్రకటించగా దాన్నే కొనసాగిస్తూ తాజాగా జరిగిన సమావేశం నిర్ణయం తీసుకున్నారని అధికార వర్గాల సమాచారం. 2018-19లో అది 8.65 శాతంగా ఉన్న విషయం పాఠకులకు విదితమే! మరోవైపు తాజా బడ్జెట్‌లో ఈపీఎఫ్‌పై కీలక నిర్ణయం తీసుకుని ఉద్యోగుల వాటా ఏడాదికి రూ.2.5 లక్షలు దాటితే వడ్డీపై పన్ను విధించనున్నట్లు ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగం సందర్భంగా ప్రకటించారు.