ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు గవర్నర్‌, కర్నాటక గవర్నర్‌ గా సమర్ధవంతంగా పరిపాలించిన కొణిజేటి రోశయ్య ఆరోగ్య సమస్యలతో కన్నుమూశారు. అకస్మాత్తుగా బీపీ డౌన్ అయిపోవడంతో స్టార్‌ ఆస్పత్రికి తరలిస్తున్న నేపథ్యంలో ఉదయం 8.20గంటలకు ఆయన కన్నుమూసారు. రోశయ్య వయసు 88 సంవత్సరాలు. రోశయ్య అంత్యక్రియలను అధికారిక లాంచనాలతో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయిస్తూ రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రోశయ్య కీలక బాధ్యతలు చేపట్టి, కాంగ్రెస్‌లో కీలక నేతగా ఎదిగారు. 2009 నుంచి 2010 మధ్యలో ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా పని చేశారు. 2011 నుంచి 2016 వరకు తమిళనాడు గవర్నర్‌గా విధులు నిర్వహించారు. రెండు నెలల పాటు కర్నాటకకు కూడా గవర్నర్‌గా వ్యవహరించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, ఎంపీగా పని చేశారు. సుమారు 50 ఏళ్ల రాజకీయ జీవితంలో అనేక పదవులు చేపట్టిన ఘనత ఆయనది.

కొణిజేటి రోశయ్య గుంటూరు జిల్లా వేమూరు గ్రామంలో 1933, జూలై 4న జన్మించి గుంటూరు హిందూ కళాశాలలో చదువుకున్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున తొలుత శాసనమండలికి ప్రాతినిధ్యం వహించారు. 1968, 1974, 1980లలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 1985లో ఎన్టీఆర్ శాసనమండలి రద్దు చేసిన తర్వాత తెనాలి నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. 1989లో మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసారు. ఆ తరువాత, వివిధ ముఖ్యమంత్రుల పాలనలో అనేక కీలక శాఖలను నిర్వహించారు. 1998లో నరసరావుపేట నుంచి రోశయ్య ఎంపీగా గెలిచారు. 2004లో చీరాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. వైఎస్సార్ క్యాబినెట్‌లో కీలక నేతగా వ్యవహరించారు. అదే సమయంలో మండలి పునరుద్ధరణ తరువాత మరోసారి శాసనమండలికి ప్రాతినిధ్యం వహించారు. వైఎస్సార్ మరణం అనంతరం 2009 సెప్టెంబర్ 3 నుంచి 2010 నవంబరు 24 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి, తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో ఆయన తన సీఎం పదవికి రాజీనామా చేసిన ఏడాదికే తమిళనాడు గవర్నర్‌గా నియమితులయ్యారు.

ఉమ్మడి రాష్ట్రంలో సుదీర్ఘకాలం పాటు ఆర్థికమంత్రిగా పనిచేశారు. 2009-10 బడ్జెటుతో కలిపి మొత్తం 15 సార్లు రాష్ట్ర బడ్జెటును ప్రవేశపెట్టిన ఘనత ఆయనకే దక్కుతుంది. ఇందులో చివరి 7 సార్లు వరుసగా బడ్జెట్‌ ప్రవేశపెట్టింది ఆయనే. బడ్జెట్ కూర్పులో రోశయ్య ఘనాపాటిగా పేరుపొందారు. వై.ఎస్.రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందడంతో 2009, సెప్టెంబర్ 3 న రోశయ్య ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. పద్నాలుగు నెలలు అధికారంలో కొనసాగిన అనంతరం 2010 నవంబరు 24 వ తేదీన తన పదవికి రాజీనామా చేశారు. 2011 ఆగస్టు 31న తమిళనాడు రాష్ట్ర గవర్నరుగా బాధ్యతలు చేపట్టి.. 2016 ఆగస్టు 30 వరకూ సేవలు అందించారు. ఆయన మరణ వార్త విని పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. ఆయన మృతితో గొప్ప అనుభవంగల నాయకుడిని తెలుగుజాతి కోల్పోయిందని కంటతడి పెడుతున్నారు.