తూర్పు లండన్‌లోని హ్యక్నీకి చెందిన స్టీవ్ వర్జీ అనే ఒక రోగి ప్రపంచంలోనే తొలిసారిగా మూర్ ఫీల్డ్స్ కంటి ఆసుపత్రిలో నవంబర్ 25వ తేదీన శస్త్ర చికిత్స ద్వారా 3డి కృత్రిమ కన్నును అమర్చుకున్నారు. సంప్రదాయ తరహాలో ఉండే యాక్రిలిక్ కృత్రిమ కంటి కంటే ఇది మరింత సహజంగా ఉంటుందని, రోగులకు అమర్చేందుకు సమయం కూడా తక్కువ పడుతుందని వైద్యులు అన్నారు. సాధారణంగా దీనిని అమర్చేందుకు ఆరు వారాలు పట్టే ప్రక్రియ మూడు వారాలకు తగ్గుతుంది అని అన్నారు.

“నాకు 20 సంవత్సరాలున్నప్పటి నుంచి నాకు కృత్రిమ కన్ను అవసరం ఉంది. దాని గురించి ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేవాడిని” అని 40 సంవత్సరాల వయసులో ఉన్న వర్జీ చెప్పారు. “నేను ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు, నన్ను నేను అద్దంలో రెండు సార్లు చూసుకుంటాను. కానీ, నా రూపం నాకు నచ్చేది కాదు” అని, ఈ కొత్త కన్ను చూడటానికి బాగుంది. ఇది 3డి ప్రింటింగ్ టెక్నాలజీ పై ఆధారపడి పనిచేస్తుంది. దాంతో, ఇది మరింత మెరుగ్గా తయారైంది” అని వర్జీ అన్నారు. రానున్న క్లినికల్ ట్రయల్స్ ద్వారా మరిన్ని ఆధారాలు దొరకగలవు అని ఆస్పత్రి వర్గాలు ఆశాభావం వ్యక్తం చేసాయి.