అమెరికాలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అధ్యక్షుడు జో బైడెన్ నిబంధనలు కఠినతరం చేస్తూ వచ్చేవారం నుంచి అమెరికాలో అడుగుపెట్టేవారు ఎవరైనా తమ ప్రయాణానికి ముందు 24 గంటలలోపు కోవిడ్ టెస్ట్ చేయించుకుని నెగటివ్ రిపోర్ట్‌తో రావాలి. ఇతర దేశాల నుంచి తిరిగి అమెరికా వచ్చే అమెరికన్లకూ ఈ నిబంధన వర్తిస్తుంది. అంటే కాకుండా రెండు డోసుల వ్యాక్సీన్ పూర్తయినవారు కూడా టెస్ట్ నెగటివ్ రిపోర్ట్‌ తీసుకునే అమెరికాకు రావాలని నిబంధన విధించారు.

ఒకవేళ ఈమధ్య కాలంలో కరోనా బారినపడి కోలుకున్నవారైతే అందుకు సంబంధించిన పత్రాలు చూపించాల్సి ఉంటుంది. అలాగే విమానాలు, రైళ్లు, బస్సులలో మాస్కు ధారణ తప్పనిసరి.. ఈ నిబంధన మార్చి వరకు అమలులో ఉంటుంది.

ఇప్పటివరకు అమెరికాలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు 10 నమోదయ్యాయి. కాలిఫోర్నియా, కొలరాడో, మిన్నెసోటా, న్యూయార్క్, హవాయిలో ఈ కేసులు వెలుగుచూశాయి. వీరిలో హవాయికి చెందిన వ్యక్తి ఎక్కడికీ ప్రయాణాలు చేయనప్పటికీ ఆయనలో ఒమిక్రాన్ వేరియంట్ కనిపించిందని అధికారులు చెబుతున్నారు.

ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి తీవ్రత ఎక్కువగా ఉంటుందా? వ్యాక్సీన్లకు ఇది లొంగుతుందా? లొంగదా లాంటి లక్షణాల విషయంలో ఇంకా ఎలా స్పష్టత రాలేదు. ఈ చలికాలంలో కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతాయన్న అంచనాల నేపథ్యంలో అర్హులంతా కోవిడ్ వ్యాక్సీన్ బూస్టర్ డోస్ వేయించుకోవాలని అమెరికా ప్రభుత్వం తన ప్రజలకు చెబుతోంది. ఇప్పటికే అమెరికా, మరికొన్ని దేశాలు ఆఫ్రికా ఖండంలోని 8 దక్షిణ దేశాలకు రాకపోకలు నిషేధించాయి. మరికొన్ని దేశాల నుండి రాకపోకలు కూడా నిషేధించే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం!