దక్షిణాఫ్రికాలో కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ వెలుగుచూసి, కంపెనీ నిర్దేశించిన వ్యాక్సిన్‌లపై కొంత వ్యతిరేకత ఎదురౌతున్న నేపథ్యంలో గతంలో ప్రకటించిన ‘రిటర్న్‌ టు ఆఫీస్‌’ తప్పనిసరి పాలసీ నుండి గూగుల్‌ సంస్థ యూటర్న్ తీసుకుంది.

వర్క్‌ఫ్రం హోం ముగిసిందని, వచ్చే ఏడాది జనవరి 10 నుండి వారంలో మూడు రోజుల పాటు ఉద్యోగులు ఆఫీసులకు హాజరుకావల్సిందేనని ఆగస్టులో గూగుల్‌ సంస్థ ఇప్పటికే ప్రకటించిన దరిమిలా జనవరి 10 డెడెలైన్‌ను వాయిదా వేయవచ్చని గూగుల్‌ ఎగ్జిక్యూటివ్‌లు గురువారం తెలిపారు. గతంలో పరిస్థితులను అనుసరించి వర్క్‌ఫ్రం హోంను వెనక్కుతీసుకున్నాము కానీ ప్రస్తుతం కరోనా కొత్త వేరియంట్‌ కేసులు పెరుగుతుండటంతో మార్పులు ఉండవచ్చని అంచనా వేశారు.

అమెరికా ఉద్యోగులలో సుమారు 40 శాతం మంది గత రెండు, మూడు వారాల నుండి ఆఫీసులకు హాజరవుతున్నారని, ఇతర దేశాల్లో మాత్రం వర్క్‌ఫ్రం హోం కొనసాగుతుందని, మరోవైపు ప్రభుత్వ కాంట్రాక్టులపై పనిచేస్తున్న ఉద్యోగులపై కంపెనీ విధించిన వ్యాక్సినేషన్‌ విధానాన్ని వ్యతిరేకిస్తూ గతవారం వందలాది మంది ఉద్యోగులు ఆందోళన చేపట్టడం కూడా జరిగినది.