క్యాన్సర్‌ బారినపడ్డవారు కీమోథెరపీ, రేడియేషన్‌ థెరపీ తీసుకోకుండా ఉండడం కుదరని పని. అయితే ఇవి క్యాన్సర్‌ కణాలను చంపినప్పటికీ కొన్ని దుష్ప్రభావాలు కూడా ఎదురవుతూ ఉంటాయి.

ఈ ట్రీట్మెంట్ వల్ల నిస్సత్తువ, వికారం, జుట్టు ఊడటం, బరువు తగ్గటం, నొప్పి, విరేచనాలు, జీర్ణకోశ సమస్యలు, రోగనిరోధకశక్తి తగ్గటంతో పాటు నోట్లో, గొంతులో పుండ్లు పడుతుంటాయి. రేడియో థెరపీ క్యాన్సర్‌ కణాలనే కాకుండా ఆరోగ్యంగా ఉన్న చుట్టుపక్కల కణాలనూ చంపేస్తుంది. ఈ నేపథ్యంలో దుష్ప్రభావాలను నివారించే దిశగా అమెరికాలోని క్లీవ్‌లాండ్‌ క్లినిక్‌, మనదేశానికి చెందిన అలహాబాద్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ప్రతిభావంతమైన కొత్త చికిత్సను రూపొందించారు.

అదేంటంటే.. జన్యువుకు సంబంధించిన నాన్‌కోడింగ్‌ డీఎన్‌ఏ పోచను (యాంటీ-సెన్స్‌) శరీరంలో ప్రవేశపెట్టటం ద్వారా ఎంఐఆర్‌-21ను నిర్యీర్యం చేయటం.. ఇదే ఇందులోని కీలకాంశం. క్షీరదాల కణాల్లో పెద్దమొత్తంలో ఉండే మైక్రోఆర్‌ఎన్‌ఏల్లో ఎంఐఆర్‌-21 ఒకటి. ఇది కణాలు తమకుతాముగా చనిపోవటం, క్యాన్సర్‌ కారక ప్రభావాలను నియంత్రిస్తుంటుంది. దీనిని ఎలుకల్లో ప్రవేశపెట్టగా కణితులు క్రమంగా కొన్ని కణితులు కుంచించుకుపోగా మరికొన్ని కణితులు పూర్తిగా అదృశ్యమయ్యాయి కూడా. అందుకే ఇప్పుడు దీన్ని మనుషులపై పరీక్షించాలని భావిస్తున్నారు. ఇది అందుబాటులోకి వస్తే కీమో, రేడియో థెరపీలను ఉపయోగించే అవసరం తగ్గుతుందని అభిప్రాయపడుతున్నారు.