కేవైసీ పెండింగ్‌లో ఉన్న బ్యాంకు ఖాతాదారులకు, పెన్షనర్లకు ప్రభుత్వం గొప్ప ఉపశమనం కల్పిస్తూ పెన్షన్ కోసం లైఫ్ సర్టిఫికేట్, బ్యాంక్ ఖాతా కోసం KYC అప్‌డేట్ కోసం గడువు పొడిగించారు. జీవిత ధృవీకరణ పత్రాన్ని సమర్పించలంటే చివరి తేదీగా ఫిబ్రవరి చివరి వరకు అలాగే KYC అప్‌డేట్‌ కోసం మార్చి వరకు పెంచారు. దీని వల్ల ప్రజలకు దాదాపు 3 నెలల సమయం దొరికినట్లయింది. ప్రభుత్వ పెన్షనర్లకు జీవన్ ప్రమాణ్ దాఖలు చేయడానికి చివరి తేదీ ఫిబ్రవరి 28 వరకు నిర్ణయించారు. ఇదివరకు దీని చివరి తేదీ డిసెంబర్ 31, 2021గా ఉండేది. అయితే గడువుతేదిని పొడిగించడం ఇది రెండోసారి.

సాధారణంగా ప్రతి సంవత్సరం నవంబర్ 30 నాటికి పింఛనుదారులు తమ జీవిత ధృవీకరణ పత్రాన్ని బ్యాంకు లేదా పెన్షన్ ఏజెన్సీకి ఫైల్ చేయాల్సి ఉంటుంది. కానీ ఈసారి నవంబర్ 30కి బదులుగా డిసెంబర్ 31న నిర్ణయించారు. తరువాత డిసెంబర్ 31 తేదీని ఇటీవల ఫిబ్రవరి 28, 2022 వరకు పొడిగించారు. గతంలో కూడా పెరుగుతున్న కరోనా వ్యాప్తి దృష్ట్యా ప్రభుత్వం లైఫ్ ప్రూఫ్ సమర్పించడానికి చివరి తేదీని పొడిగించింది. ఈసారి మళ్లీ కొత్త వేరియంట్ ఓమిక్రాన్ ముప్పు కనిపిస్తోంది. వృద్ధులు లైఫ్ సర్టిఫికేట్ సమర్పించడానికి బ్యాంకు లేదా పెన్షన్ ఏజెన్సీకి వెళ్తే వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుంది. అందుకే చివరి తేదీని ఫిబ్రవరి 28 వరకు పొడిగించారు.