డెడ్ స్కిన్ సెల్స్ లేదా మృత కణాలు.. చాలా మంది ఈ సమస్య తో బాధపడుతుంటారు. చర్మంపై డెడ్ స్కిన్ సెల్స్ పేరుకుపోతే మొటిమలు, మచ్చలు, ముడతలు ఇలా రకరకాల చర్మ సంబంధిత సమస్యలు ఇబ్బంది పెడతాయి. అందుకే డెడ్ స్కిన్ సెల్స్‌ను ఎప్పటి కప్పుడు తొలగించుకోవాలని సౌందర్య నిపుణులు సూచిస్తుంటారు. అలా అని మృత కణాలను వదిలించుకునేందుకు మార్కెట్‌లో లభ్యమయ్యే క్రీములు, పౌడర్లపై ఆధారపడడం కంటే ఇంట్లో ఉన్నవాటితో పరిష్కారం చేసుకోవచ్చు. మరి ఆ రెమిడీ ఏంటో ఇప్పుడు చూద్దామా..

ఒక బంగాళదుంప తీసుకుని పొట్టు తీసి నీటిలో కడిగి ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్‌లో కడిగిన బియ్యం రెండు స్పూన్లు, కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు, ఒక గ్లాస్ వాటర్ వేసుకుని పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఉడికించుకున్న బియ్యం, బంగాళదుంప ముక్కలను చల్లార బెట్టుకుని.. ఆపై మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్‌లో ఒక స్పూన్ ఎర్ర కందిపప్పు పొడి, రెండు స్పూన్ల పాలు, ఒక స్పూన్ నిమ్మ రసం, ఒక స్పూన్ తేనె వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు అప్లై చేసుకుని కాసేపు డ్రై అవ్వనివ్వాలి. అనంతరం కొద్దిగా వాటర్ జల్లి వేళ్లతో స్మూత్‌గా స్క్రబ్ చేసుకుంటూ క్లీన్ చేసుకోవాలి. ఇలా వారంలో రెండు సార్లు చేస్తే డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోయి చర్మం గ్లోగా, అందంగా మారుతుంది. ఇంకా చర్మం రంగు కూడా మెరుగుపడుతుంది.