ప్రపంచంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లలో ఉత్తమంగా పని చేస్తోందని చెబుతున్న ఫైజర్ వ్యాక్సిన్ భారత్‌లో ఇప్పుడప్పుడే అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు. భారత్‌కు వ్యాక్సిన్ దిగుమతి చేసేందుకు అనుమతించాలని, క్లినికల్ ట్రయల్స్ నుంచి మినహాయించాలని గత డిసెంబర్లో ఫైజర్ సంస్థ భారత ప్రభుత్వాన్ని విజ్ఙప్తి చేసింది. నిజానికి, భారత్‌లో వ్యాక్సిన్ వినియోగం కోసం మొదట దరఖాస్తు చేసుకున్నది ఫైజర్ సంస్థనే.
అయితే, అనూహ్యంగా తాము భారత ప్రభుత్వానికి చేసుకున్న దరఖాస్తును ఉపసంహరించుకుంటున్నట్లు ఫైజర్ ప్రకటించింది. వ్యాక్సిన్ల అనుమతికి సంబంధించి మన ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ ఫైజర్ వ్యాక్సిన్ అభ్యర్థనను పరిశీలించి, భారత్‌లో అనుమతించాలంటే తమకు వ్యాక్సిన్, క్లినికల్ ట్రయల్స్‌కు సంబంధించి మరింత సమాచారం ఇవ్వాలని ఫైజర్ సంస్థకు సూచించింది.
దీంతో, తాము చేసిన దరఖాస్తును ఉపసంహరించుకుంటున్నామని ఫైజర్ ప్రకటించింది. అయితే, భారత్‌లో తమ వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకువస్తామని, నిపుణుల కమిటీ అడిగిన సమాచారంతో తర్వాత మళ్లీ దరఖాస్తు చేసుకుంటామని చెప్పింది. కాగా, అమెరికా, యూకే సహా పలు దేశాల్లో ఫైజర్ వ్యాక్సిన్ పంపిణీ జరుగుతోంది. ఈ వ్యాక్సిన్‌ను మైనస్ 70 డిగ్రీల ఉష్ణాగ్రతలో భద్రపర్చాల్సి ఉంటుంది.