సెల్ఫీల మోజులో పడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నసంఘటనలు మనం ఎన్నో చూస్తూ ఉన్నాం! కొంత మంది కొత్త ప్రదేశానికి వెళ్లినా సెల్ఫీలు తీసుకొని సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడు చేయడం, వింతవింత ప్రయోగాలు చేయడం నేటి యువతరానికి సాధారణం అయిపొయింది. దానిలో తప్పు లేకపోయినా మనం వెళ్లిన చోటు, పరిసరాలు అన్ని గమనించాలని విషయం గుర్తుంచుకోవాలి. ఒక్కొక్కసారి ఒక్క ఫోటో తో చాలా విషయాలు బహిర్గతమైపోతుంటాయి. అలాంటి సంఘటనే జర్మనీలో జరిగింది. ఒక యువకుడు జైలులో ఒక్క సెల్ఫీ తీసుకోవడం వల్ల ఏకంగా జైలులో ఉన్న వందలాది గదులకు తాళాలు మార్చాల్సి వచ్చింది. బెర్లిన్‌లోని జేవీఏ హైడరింగ్‌ జైలుకి ఇటీవల ఒక యువకుడు ఇంటర్న్‌షిప్‌ చేయడానికి వెళ్లారు. మొదటిసారి జైలుకు వచ్చిన అతడు ఈ విషయాన్ని స్నేహితులతో పంచుకోవాలన్న ఆతృతలో జైలులోని ప్రధాన కార్యాలయంలో సెల్ఫీ తీసుకొని వాట్సాప్‌లో స్నేహితులందరికి షేర్‌ చేశారు. అయితే పొరపాటు ఎక్కడ జరిగిందంటే.. అతడు దిగిన సెల్ఫీలో జైలుకు సంబంధించి మాస్టర్‌ తాళంచెవితోపాటు ముఖ్యమైన గదులకు సంబంధించిన తాళం చెవులు కూడా చాలా స్పష్టంగా నిపుణులతో వాటికి నకిలీ తాళంచెవులు సృష్టించగలిగేలా కనిపించాయి. ఈ విషయం జైలు అధికారుల దృష్టికి వెళ్లగా వెంటనే అతడిని ఇంటర్న్‌షిప్‌ నుంచి తొలగించి నష్టనివారణ చర్యలు మొదలు పెట్టారు. జైలులో ఉన్న 600 గదులకు తాళాలతో పాటు పాస్‌కోడ్‌లు కూడా మార్చారు. ఒకవేళ పోలీసులు సమయానికి చర్యలు తీసుకోకపొతే ఆ తాళంచెవులు పొరపాటున జైలు ఖైదీలకు అందితే కచ్చితంగా వారంతా పారిపోయే అవకాశం ఉండేదని అక్కడి అధికారులు, ప్రజలు అభిప్రాయపడ్డారు. కానీ పాతవి తీసేసి కొత్తవి మార్చడానికి 20 మంది సిబ్బంది అవసరమయ్యారట. ఇదీ సెల్ఫీ కథ!