రామాయణ మహా భారత కథల్లో రహస్య గదులు, భూగృహాలు ఉండేవని విన్నాము. పాత సినిమాల్లో అప్పుడప్పుడు భూమి లోపల, కప్బో‌ర్టుల వెనక రహస్య గదులు ఉండే సన్నివేశాలను చూసాము. కానీ అద్దం వెనుక ఒక అపార్ట్మెంట్ ఉంటుందనే విషయం ఎప్పుడైనా అనుకున్నామా? కానీ ఇలాంటి సంఘటన అమెరికా న్యూయార్క్ లో చోటు చేసుకుంది. టిక్‌టాక్‌ యూజర్‌ సమంతా హార్ట్‌సో అనే మహిళ తన బాత్రూమ్‌ అద్దం వెనక ఏకంగా ఓ అపార్ట్‌మెంట్‌ ఉందని కనిపెట్టారు. దీని తాలూకు వీడియోని టిక్‌టాక్‌లో షేర్‌ చేశారు. దీన్ని ఇప్పటికే 7 మిలియన్ల మంది చూశారు.

ఈసందర్భంగా సమంతా మాట్లాడుతూ ‘‘గత కొద్ది రోజులుగా నా బాత్రూమ్‌లోకి చల్లటి గాలి వీస్తుంది. అక్కడ కిటికీ, వేరే కూలింగ్‌ పరికరాలు ఏం లేవు. ఆ గాలి ఎంత బలంగా వీస్తుంది అంటే అది నా జుట్టును వెనక్కి నెడుతుంది. ఈ గాలి ఎక్కడి నుంచి వీస్తుందా అని వెతకడం మొదలైన క్రమంలో బాత్రూమ్‌ సింక్‌కు అతికించిన అద్దం వెనక నుంచి ఈ గాలి వస్తుందని కనిపెట్టాను. దాంతో అద్దం పక్కకి జరిపి చూశాను. అక్కడ పెద్ద రంధ్రం కనిపించింది. ఇక ఆ ప్రదేశంలో ఏమి ఉందొ తెలుసుకోవడం కోసం అక్కడకు వెళ్లాలని భావించాను. ఈ క్రమంలో ఫేస్‌మాస్క్‌ పెట్టుకుని, చేతికి గ్లౌవుజులు ధరించి బయలు దేరడానికి సిద్ధమై ఎందుకైనా మంచిదని ముందు జాగ్రత్తం చర్యగా ఓ సుత్తిని కూడా తీసుకెళ్ళాను. ఆ తర్వాత బాత్రూమ్‌ వెనక నాకు కనిపించిన పెద్ద రంధ్రం గుండా లోపలికి ప్రవేశించాను. మొదట అదేదో సీక్రెట్‌ రూమ్‌గా భావించిన నేను ఆ తర్వాత అక్కడ మొత్తం అపార్ట్‌మెంట్‌ని చూసి షాకయ్యను.

అపార్ట్‌మెంట్‌ చూసి ఆశ్యర్యంతో గట్టిగా కేకలు వేశాను. ఇక​ ఆ అపార్ట్‌మెంట్‌ అంతా చెత్త బ్యాగులు మరియు వాడేసిన వాటర్‌ బాటిళ్లు ఉన్నాయి. ‘‘లోపలికి అడుగుపెట్టిన నేను అక్కడ ఎవరైనా ఉంటారని భావించాను. కానీ అద్దం వెనక ఏకంగా అపార్ట్‌మెంట్‌ ఉండటం నిజంగా వింతే’’ అన్నారు.