దేశవ్యాప్తంగా ఒకవైపు కరోనా టీకా కార్యక్రమం సజావుగా సాగుతుంటే మరోవైపు కరోనా వైరస్ వ్యాప్తి కూడా దానితో సమానంగా కొనసాగుతూనే ఉంది. కొత్త కేసులు 17వేలకు చేరుతుండటం ఆందోళనకరంగా ఉంది. గురువారం 7,61,834 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే 16,838 కొత్త కేసులు వెలుగుచూడగా, మొత్తం కేసుల సంఖ్య 1,11,73,761కి చేరుకుంది. మూడు రోజుల తర్వాత మళ్ళీ మరణాల సంఖ్య 100 దాటింది.
గడిచిన 24 గంటల్లో 113 మందికి వైరస్ సోకగా, ఇప్పటివరకు 1,57,548 మంది ప్రాణాలు వదిలారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

రోజురోజుకి క్రియాశీల కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. దేశంలో 1,76,319 క్రియాశీల కేసులతో ఆ రేటు 1.58 శాతానికి చేరింది. రికవరీరేటు మాత్రం 97.01 శాతానికి తగ్గింది. నిన్న ఒక్కరోజే 13,819 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారని, మొత్తంగా 1.08కోట్ల కంటే ఎక్కువ మంది వైరస్ నుంచి బయటపడ్డారని మంత్రిత్వ శాఖ తెలిపింది.

మరోవైపు, దేశవ్యాప్తంగా కరోనా టీకా కార్యక్రమం మార్చి ఒకటిన రెండో దశలోకి అడుగుపెట్టగా మార్చి 4నాటికి 1,80,05,503 మంది టీకా వేయించుకున్నట్లు కేంద్రం చెప్పింది. నిన్న ఒక్కరోజే 13,88,170 మంది టీకా తీసుకున్నారు.