2016లో కల్తీ సారా తాగి 21మంది ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటనకు సంబంధించిన కేసులో తొమ్మిది మందికి బిహార్‌లోని ప్రత్యేక ఎక్సైజ్‌ న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చి మరణశిక్ష విధించింది. ఇదే వ్యవహారంలో దోషులుగా తేలిన నలుగురు మహిళలకు జీవిత ఖైదుతో పాటు ఒక్కొక్కరికి రూ.10లక్షల చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది.
ఈ సంఘటన 2016 ఆగస్టులో గోపాల్‌గంజ్‌ జిల్లా ఖర్జుర్‌బని ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈ విషాదంలో 21మంది మరణించగా, అనేకమంది అనారోగ్యానికి గురయ్యి, ఇద్దరు వ్యక్తులు చూపును కూడా కోల్పోయారు. ఈ కేసును విచారించిన ప్రత్యేక న్యాయస్థానం ఫిబ్రవరి 26న ఈ 13మందిని దోషులుగా నిర్ధారించి, ఇప్పుడు తాజాగా వారికి శిక్షలు ఖరారు చేస్తూ తీర్పు ఇచ్చింది. మరణ శిక్ష పడిన ఈ తొమ్మిది మంది ఒకే కుటుంబానికి చెందినవారు కావడం గమనార్హం.

ఈ ఘటన నేపథ్యంలో నిర్లక్ష్యం వహించారని పేర్కొంటూ ప్రభుత్వం గతేడాది జూన్‌లో ముగ్గురు ఎస్సైలు సహా 21మంది పోలీసులను కూడా డిస్మిస్‌ చేసింది. ఒకే కేసులో ఇంతమందికి ఉరిశిక్ష పడటం బిహార్‌లో ఇదే తొలిసారి అని గోపాల్‌గంజ్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ దేవ్‌వంశ్‌ గిరి తెలిపారు.