హైదరాబాద్‌- విజయవాడ జాతీయ రహదారిపై నల్గొండ జిల్లా నకిరేకల్‌ శివారులో ఫిల్మ్‌ నగర్‌ నుంచి తణుకుకు సినిమా షూటింగ్‌ కోసం కారులో వెళ్తున్న శ్రీవాసవీ మూవీస్‌ సంస్థకు చెందిన సాంకేతిక సిబ్బంది ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరు ప్రయాణిస్తున్న కారు వెనుక టైరు పగిలిపోయి అదుపుతప్పి రోడ్డు పక్కనున్న కాలువలో బోల్తా పడింది.

కారులో ప్రయాణిస్తున్న యూసుఫ్‌గూడకు చెందిన సంస్థ సౌండ్‌ ఇంజినీర్‌ గార్లపాటి రవి(53) అక్కడికక్కడే చనిపోయారని తెలిపారు. వికారాబాద్‌కు చెందిన కెమెరా అసిస్టెంట్‌ ఎం.శ్రీకాంత్‌(27), మాదాపూర్‌ పార్వతీనగర్‌కు చెందిన కెమెరా అసిస్టెంట్‌ అలక శ్రీనివాస్‌(53), ఫిల్మ్‌నగర్‌కు చెందిన డ్రైవర్‌ ఇంటవారి సురేంద్ర(23), యూసుఫ్‌గూడకు చెందిన సంస్థ ఎడిటర్‌ గుడ్ల అనిల్‌కుమార్‌(24) తీవ్రంగా గాయపడడంతో నకిరేకల్‌ ప్రభుత్వ వైద్యశాలలో ప్రథమ చికిత్స చేయించి హైదరాబాద్‌లోని ప్రైవేట్‌ వైద్యశాలకు తరలించారని సీఐ కె.నాగరాజు తెలిపారు.