దేశంలో ప్రభుత్వ ఉద్యోగం పొందడం కోసం ఎంతకైనా తెగించేవారు కోకొల్లలుగా ఉన్నారు. వారిలో కొంత మంది కష్టపడి ఉన్నత విద్య చదివి ప్రభుత్వ ఉద్యోగం చేస్తే, మరి కొంతమంది మాత్రం అక్రమ మార్గాల్లో ఉద్యోగాలు పొందేందుకు ప్రయత్నిస్తారు. అలాంటి ఒక విచిత్రమైన కేసు ఇప్పుడు చూద్దాం!

జమ్మూలో శక్తి బంధు అనే వ్యక్తి, అతని తమ్ముడు అశోక్ కుమార్ ఉండేవారు. శక్తి బంధు తమ్ముడు అశోక్ కుమార్ 1977లో బీఏ చదువుతుండగా చనిపోయాడు.దీనిని అవకాశంగా తీసుకుని కొన్ని సంవత్సరాల తర్వాత శక్తి బందు అశోక్ పేరుతో IMPAలో ఉద్యోగం పొందాడు. దీనికి కొంతమంది అధికారులు కూడా అతనికి సహాయం చేసారు. క్రైం బ్రాంచ్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఈ కేసుపై పూర్తిస్థాయిలో విచారణ చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు 30 ఏళ్లుగా అశోక్‌కుమార్ పేరుతో IMPAలో పనిచేస్తున్నాడని, అతడు కనీసం తొమ్మిదో తరగతి కూడా పాస్ కాలేదని ఛార్జ్‌షీట్‌లో తెలిపారు.

శక్తిబంధుపై IPCలోని వివిధ సెక్షన్ల కింద కేసు రాశామని పోలీసులు చెప్పారు. అన్ని వివరాలు సేకరించడానికి IMPA, జమ్మూ కశ్మీర్ స్కూల్ ఎడ్యుకేషన్, అచ్చాన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, అచ్చాన్ ప్రాథమిక పాఠశాలల నుంచి అశోక్ కుమార్, శక్తి బంధు స్టడీ సర్టిఫికెట్లను పోలీసులు పరిశీలించారు. ప్రస్తుతం కేసుపై కోర్టులో విచారణ జరుగుతోంది. కోర్టులో న్యాయ విచారణ తర్వాత అతనికి తీవ్రమైన శిక్షపడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.