ఆదివారం ఒక్కరోజే లక్షకు పైగా కొత్త కేసులు రావడంతో ఆయా రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు అప్రమత్తమవుతున్నాయి. దేశం జనం రద్దీ నియంత్రణపై దృష్టిపెట్టడంతో మరోసారి ఆంక్షల వలయంలోకి జారుకుంటోంది. ఈ తరుణంలో షిర్డీలోని సాయిబాబా ఆలయాన్ని మూసివేయాలని శ్రీ సాయిబాబా సంస్థాన్‌ ట్రస్ట్‌ (ఎస్‌ఎస్‌ఎస్‌టీ) నిర్ణయించింది. ఈ రోజు రాత్రి 8గంటల నుంచి ఈ నెల 30 వరకు మూసి ఉంచనున్నట్టు, సాయి బాబా ఆలయంతో పాటు ప్రసాదాలయ, భక్త నివాస్‌ కూడా మూసివేయనున్నామని ప్రకటించింది. ఈ సమయంలో రోజువారీ పూజా కార్యక్రమాలు మాత్రం కొనసాగనున్నాయి. ఆలయం మూసివేసినప్పటికీ ఎస్‌ఎస్‌ఎస్‌టీ ఆధ్వర్యంలో ప్రారంభించిన కొవిడ్‌ ఆస్పత్రి, ఇతర ఆస్పత్రులు మాత్రం పనిచేస్తాయని ట్రస్టు స్పష్టంచేసింది.