మెదక్‌ జిల్లా శంకరంపేట మండలం శలిపేట గ్రామంలో పంట పొలాలకు నీరు విడుదల చేయమని అడిగిన రైతులను గ్రామ సర్పంచి నిర్బంధించిన ఘటన జరిగింది. శలిపేట గ్రామంలో మండుతున్న ఎండలకు భూగర్భ జలాలు అడుగంటడంతో గ్రామంలోని పంట పొలాలు ఎండిపోవడం వల్ల గ్రామంలోని నల్ల చెరువు నుంచి నీరు విడుదల చేయాలంటూ కొందరు రైతులు తహసీల్దారును కోరారు. దానికి స్పందించిన తహసీల్దార్‌ వీఆర్‌వోను పంపితే సర్పంచి కలుగజేసుకొని గ్రామసభ నిర్వహించిన తర్వాతే నీరు వదులుతామని తెలిపారు. కానీ గ్రామసభ పెట్టకుండా కాలయాపన చేస్తుండటంతో నీరు విడుదల చేసేందుకు రైతులు చెరువు కట్టకు వెళ్లగానే సర్పంచి, అతడి కుమారులు రైతులతో వాగ్వాదానికి దిగి అసభ్య పదజాలంతో దూషించి గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్బంధించారు.