చైనా ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన తన బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనిషియేటివ్‌(బీఆర్‌ఐ) ప్రాజెక్టులో ఒక కీలక ఘట్టం శుక్రవారం ఆవిష్కృతమైంది. అదేంటంటే.. చైనాలోని యునాన్‌ ప్రావిన్స్‌లోని కున్‌మింగ్‌ నుంచి లావోస్‌ రాజధాని వియంటియాన్‌కు రైలు మార్గం ప్రారంభమైంది. బీఆర్‌ఐలో ఇది తొలి సీమాంతర ప్రాజెక్టు.

ప్రారంభోత్సవ కార్యక్రమంలో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌.. లావోస్‌ ప్రధాని థాంగ్లూన్‌ సిసోలిత్‌ పాల్గొన్నారు. ఈ ప్రాజెక్టు విలువ 600 కోట్ల డాలర్లుగా నిర్ణయించారు. 2016లో ఈ ప్రాజెక్ట్ నిర్మాణం ప్రారంభమైంది. 1035 కిలోమీటర్ల ఈ రైలు మార్గం కున్‌మింగ్‌ను, వియంటియాన్‌ను కలుపుతుంది. సాధారణంగా లావోస్‌ రాజధాని నుంచి చైనా సరిహద్దుకు చేరడానికి రెండు రోజులు పడుతుంది. ఆ సమయం ఈ రైలుతో మూడు గంటలకు తగ్గే అవకాశం ఉంది.