సీబీఐ నమోదు చేసిన కేసుల విచారణ నిమిత్తం వారానికి 5 రోజులు కోర్టుకు హాజరవ్వాలంటే రాష్ట్రంలో అభివృద్ధి పనులు అన్ని ఆగిపోతాయని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం తెలంగాణ హైకోర్టుకు నివేదించారు. రోజువారీ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి పనులకూ ఆటంకమని, హాజరు మినహాయింపుపై వేసిన పిటిషన్లను సీబీఐ కోర్టు కొట్టివేయడంతో జగన్‌ హైకోర్టులో పిటిషన్లు వేయడంతో శుక్రవారం జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ వీటిపై విచారణ చేపట్టారు.

జగన్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది ఎస్‌.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ… ‘పాలనా పనులతో పాటు ప్రొటోకాల్‌ ప్రకారం భద్రతాపరమైన సమస్యలు ఎక్కువగా ఉంటాయి. సీఎం హోదాలో ఉన్న ఆయనను కలవడానికి పలువురు కోర్టుకు ఎక్కువగా వస్తారు. దీనివల్ల అందరికీ ఇబ్బందులే. ఈ కేసుల్లో ఇతర నిందితుల కారణంగా విచారణలో స్టే వచ్చింది. పిటిషనర్‌ ఇప్పటివరకు అలాంటి ఉత్తర్వులు పొందలేదు. సీఎం కాకముందు దాదాపుగా ప్రతి వారం హాజరయ్యారు. ప్రత్యేక సందర్భాల్లో కోర్టు నుంచి అనుమతి పొందారు. వీటిలో 11 కేసులున్నాయి. వీటిలో కొన్ని 2జీ కేసు కన్నా 5 రెట్లు సంక్లిష్టమైన కేసులవ్వడంతో విచారణకు ఎక్కువ సమయం పడుతుంది. ప్రతిసారి హాజరుకావడం కూడా సాధ్యం కాదు. ప్రజా విధులు నిర్వహించేవారు నిందితులుగా ఉన్న వారిని ఇబ్బంది పెట్టరాదంటూ పలు హైకోర్టులు, సుప్రీంకోర్టులు వెలువరించిన తీర్పులను పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సీబీఐ వాదనల నిమిత్తం విచారణను 6వ తేదీకి వాయిదా వేశారు.