పావురాళ్లను ఎప్పటి నుండో శాంతికి చిహ్నంగానే భావిస్తూ వస్తున్నాము. కానీ అదే పావురాలు రహస్య రాయబారం కూడా మోస్తుంటాయి. ఇప్పుడు తాజాగా ఒడిశాలో పావురాలకు చైనా ట్యాగ్స్ కనిపిస్తుండటం అధికారులను ఆశ్చర్యపరుస్తోంది. అసలేం జరిగిందంటే.. సుందర్‌గఢ్ రాజ్‌గంగ్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాంస్‌బహాల్ గ్రామంలో గాయం కావడంతో ఒక పావురం కిందపడిపోయి గిలగిల కొట్టుకుంటుండగా ఒక వ్యక్తి ఆ పావురాన్ని కాపాడేందుకు ప్రయత్నించాడు.

ఈ క్రమంలోనే పావురం కాలికి పచ్చకట్టు ఉండటం సదరు వ్యక్తి గమనించడంతో అనుమానం వచ్చి ఆ కట్టును విప్పి చూడగా చైనా ట్యాగ్ కనిపించింది. దానిపై చైనీస్ భాషలో ఏదో కోడ్ రాసి ఉంది. దీంతో అతడు పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు ఆ పావురాన్ని స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. మరోవైపు పూరీ జిల్లా హరేకృష్ణపూర్ పంచాయతీలోనూ ఓ పావురానికి చైనా ట్యాగ్ కనిపించింది. దీంతో పావురాలకు చైనా ట్యాగులు కనిపిస్తుండటంపై అధికారులు అప్రమత్తమయ్యారు.

సరిహద్దుల్లో చైనా కుట్రలు పన్నుతున్న నేపథ్యంలో పావురాల ద్వారా చైనా ఏం చెప్పాలనుకుంటుందో అర్థం కావడం లేదని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కరోనా వైరస్‌ను ప్రపంచమంతా పాకించి అస్తవ్యస్తం చేసిన చైనా ఇప్పుడు మళ్లీ ఎలాంటి కుట్రలకు పాల్పడుతుందో అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.