తిరుమల శ్రీవారికి తమిళనాడులో ఉల్లందూర్పేట ఎమ్మెల్యే ఆర్.కుమారగురు భారీ విరాళం అందించారు. చెన్నైలో శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి గానూ ఆయన తన నాలుగు ఎకరాల స్థలాన్ని విరాళంగా ఇచ్చారు. ఈ స్థలం విలువ దాదాపు రూ.20 కోట్లు ఉంటుందని అంచనా. స్థలం ఇవ్వడంతో పాటు ఆయన నిర్మాణానికి రూ.3.16 కోట్లను సైతం ఆ ఎమ్మెల్యే విరాళంగా ఇవ్వడం గమనార్హం.
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) బోర్డు ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని కలిసిన కుమారగురు విరాళంగా ఇచ్చిన భూమి పత్రాలను, డీడీని అందజేశారు. అన్నాడీఎంకే పార్టీకి చెందిన ఎమ్మెల్యే కుమారగురు తిరుమల వెంకన్నకు వీరభక్తుడు. ప్రస్తుతం ఆయన టీటీడీ బోర్డు మెంబర్గా కూడా కొనసాగుతున్నారు. కుమారగురు ఇచ్చిన స్థలంలో టీటీడీనే శ్రీవారి ఆలయాన్ని నిర్మించబోతోంది.
కాగా, త్వరలోనే జమ్మూ కశ్మీర్లో వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించబోతున్నట్లు వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు శ్రీవారి ఆలయాలు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. శ్రీవారి ఆలయ నిర్మాణానికి భారీ విరాళం అందించిన కుమారగురుకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.