విశాఖ ఉక్కు ఫ్యాక్ట‌రీని ప్రైవేటీక‌ర‌ణ చేయాల‌నే కేంద్ర ప్ర‌భుత్వ నిర్ణ‌యానికి వ్య‌తిరేకంగా తెలుగుదేశం పార్టీకి చెందిన విశాఖ ఉత్త‌ర నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస‌రావు త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేశారు. తానే స్వ‌యంగా స్పీక‌ర్‌కు లేఖ రాశారు. విశాఖ ఉక్కు ఫ్యాక్ట‌రీని ప‌రిర‌క్షించుకునేందుకే తాను రాజీనామా చేస్తున్న‌ట్లు ఆయ‌న ప్ర‌క‌టించారు. నాన్ పొలిటిక‌ల్ జేఏసీ ఏర్పాటు చేసి ఉద్య‌మాన్ని నిర్మిస్తాన‌ని ఆయ‌న పేర్కొన్నారు.

త‌న లాగే పార్టీల‌కు అతీతంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు అంతా రాజీనామా చేసి కేంద్ర ప్ర‌భుత్వంపై ఒత్తిడి తేవాల‌ని, విశాఖ ఉక్కు ఫ్యాక్ట‌రీని కాపాడుకోవాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. అయితే, గంటా శ్రీనివాస‌రావు రాజీనామా చేసిన విధానంపై ఇప్పుడు కొత్త చ‌ర్చ మొద‌లైంది. అసెంబ్లీ స్పీక‌ర్‌కు రాజీనామా లేఖ పంపిస్తున్న‌ట్లు ఆయ‌న ప్ర‌క‌టించారు.

అయితే, గంటా శ్రీనివాస‌రావు రాజీనామా చెల్లుబాటు అవుతుందా అనే ప్ర‌శ్న‌లు వ‌స్తున్నాయి. రాజీనామాను స్పీక‌ర్ ఆమోదించాలంటే స్పీక‌ర్ ఫార్మాట్‌లో ఉండాలి. ఇష్ట‌పూర్వ‌కంగానే రాజీనామా చేస్తున్నాన‌ని, ఆమోదించాల‌ని మాత్ర‌మే లేఖ రాయాలి. ఎటువంటి కార‌ణాలు రాయ‌కూడ‌దు. స్పీక‌ర్ ఫార్మాట్‌లో రాసిన రాజీనామాల‌నే స్పీక‌ర్ ఆమోదించ‌డం ఒక సంప్ర‌దాయం.

కానీ, గంటా శ్రీనివాస‌రావు రాజీనామా లేఖ‌లో తాను స్టీల్ ఫ్యాక్ట‌రీ కోస‌మే రాజీనామా చేస్తున్నట్లు రాశారు. అంతేకాదు, ఒక చిన్న ష‌ర‌తు కూడా పెట్టారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ నిర్ణ‌యం అమ‌లులోకి వ‌చ్చిన వెంట‌నే రాజీనామా చేయాల‌ని లేఖ‌లో రాశారు. ఇలా స్పీక‌ర్ ఫార్మాట్‌లో కాకుండా ష‌ర‌తులు పెట్టి చేసే రాజీనామాల‌ను స్పీక‌ర్ ఆమోదించే అవ‌కాశాలు చాలా త‌క్కువ‌.