గూగుల్ యాప్ తో.. మీ గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటుందో ఇక మీ సెల్‌ఫోన్ చెప్పేస్తుంది!
వచ్చే నెలలో అందుబాటులోకి ‘గూగుల్ ఫిట్’
తొలుత గూగుల్ పిక్సెల్ ఫోన్లకు మాత్రమే పరిమితం

హృదయ స్పందనలు తెలుసుకోవడానికి ఇక స్టెతస్కోప్‌తో పనిలేదు. చేతిలో ఉన్న స్మార్ట్‌ఫోనే ఇకపై ఆ పనిచేసి పెడుతుందని సెర్చింజన్ దిగ్గజం గూగుల్ చెబుతోంది. ఇందుకు అవసరమైన సరికొత్త ఫీచర్‌ను వచ్చే నెలలో ఆవిష్కరించనున్నట్టు తెలిపింది. అయితే, తొలుత ఇది గూగుల్ పిక్సెల్ ఫోన్లకు మాత్రమే పరిమితమని, భవిష్యత్తులో ఆండ్రాయిడ్ ఫోన్లకు కూడా అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటించింది.

‘గూగుల్ ఫిట్’ యాప్ ద్వారా శ్వాసక్రియ రేటును తెలుసుకునే సదుపాయాన్ని కల్పించనున్నట్టు గూగుల్ వివరించింది. మనుషుల ఛాతీలో ఉండే కదలికలను గుర్తించడం ద్వారా శ్వాసక్రియ రేటును ఈ యాప్ గుర్తించి చెబుతుందని పేర్కొంది. స్మార్ట్‌ఫోన్ కెమెరా, ‘ఆప్టికల్ ఫ్లో’ అనే కంప్యూటర్ విజన్ సాంకేతికతను ఉపయోగించి ఈ విధానాన్ని అభివృద్ది చేసినట్టు తెలిపింది. వ్యక్తుల వేలి కొనల రంగుల్లో మార్పును పసిగట్టడం ద్వారా ‘గూగుల్ ఫిట్’ గుండె కొట్టుకునే వేగాన్ని గుర్తిస్తుందని గూగుల్ వివరించింది.