విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని వంద శాతం ప్రైవేటీకరణ చేయాలని కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ఉద్యమం ఉదృతమవుతున్న వేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కనుక కచ్చితంగా ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయించుకుంటే రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఓ టీవీ ఛానల్‌తో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఎన్నో పోరాటాల ఫలితంగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ వచ్చిందని, ప్రజలు మనోభావాలు ఈ అంశంతో ముడిపడి ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఒకవేళ కేంద్రం కచ్చితంగా ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయాలనుకుంటే రాష్ట్ర ప్రభుత్వ పరిశ్రమల శాఖ తరపున తాము తీసుకునేందుకు బిడ్‌లో పాల్గొంటామని తెలిపారు. ఈ మేరకు త్వరలోనే ముఖ్యమంత్రికి ప్రతిపాదనలు పంపిస్తామని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్ర విభజన చట్టానికి సంబంధించి కేంద్రం నుంచి రాష్ట్రానికి చాలా నిధులు రావాల్సి ఉందని, వాటిని సర్దుబాటు చేసుకొని ఫ్యాక్టరీని రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సిందేగా కోరతామని ఆయన పేర్కొన్నారు. విభజన చట్టంలో రాష్ట్రానికి ఒక స్టీల్ ఫ్యాక్టరీ కేటాయిస్తామని కూడా కేంద్రం హామీ ఇచ్చినా, ఇప్పటివరకు నెరవేర్చలేదని ఆయన గుర్తు చేశారు.