జిల్లా మలేరియా అధికారి కె.ఎస్.ఎస్. ప్రసాద్ వెల్లడి

కె.ఆర్.పురం (పశ్చిమగోదావరి):
మలేరియా, డెంగ్యూ వ్యాధులను నియంత్రించుట కొరకు పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని మున్సిపల్ పట్టణాల్లో ప్రత్యేక సర్వేను నిర్వహించామని జిల్లా మలేరియా అధికారి కె.ఎస్.ఎస్.ప్రసాద్ వెల్లడించారు. గత నెల 25 నుండి ఈనెల 6 వరకూ ఈ సర్వే నిర్వహించడం జరిగిందని, శనివారం తో ఈ సర్వే పూర్తయిన సందర్భంగా పత్రికల వారికి ఇందుకు సంబంధించిన వివరాలను తెలియజేశారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పశ్చిమగోదావరి జిల్లాలోని అన్ని పట్టణాల్లో ముఖ్యంగా ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, భీమవరం, తణుకు, పాలకొల్లు, నరసాపురం, జంగారెడ్డిగూడెం, కొవ్వూరు సహా మొత్తం తొమ్మిది మున్సిపల్ పట్టణ ప్రాంతాల్లో ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. ఈ సందర్భంగా సర్వే యొక్క ముఖ్య ఉద్దేశ్యం గురించి జిల్లా మలేరియా అధికారి ప్రసాద్ వివరిస్తూ ఆరోగ్య, ఆశా కార్యకర్తలు ఇంటింటినీ సందర్శించి వ్యక్తిగత పరిశుభ్రతను పాటించుట గురించి ప్రజలందరికీ వివరించి ఆరోగ్యం పట్ల అవగాహన పెంపొందించారన్నారు. అలాగే, ప్రతి గృహములోని వాడని వస్తువులు మరియు నీటి నిల్వలు చేయు డ్రమ్ములు, టబ్ లు వారానికోసారి అంటే ప్రతీ శుక్రవారం శుభ్రం చేస్తూ పొడివాతావరణం పాటిస్తూ ఇంటిలోని పరిసరాలను పరిశుభ్రతను పాటిస్తూ ఇళ్ళల్లోని ఫ్రిజ్ లను, కూలర్ లను కూడా శుభ్రం చేయుట ద్వారా కూడా దోమల వ్యాప్తిని అరికట్టవచ్చునని తెలియజేశారన్నారు. ముఖ్యంగా, గృహసముదాయల సమీపంలో నీటి నిల్వలు లేకుండా చూడాలని తద్వారా దోమలను నియంత్రించవచ్చునని ప్రత్యేకించి గ్రామాల్లో గ్రూపు సమావేశములు ఏర్పాటు చేసి మరీ ప్రజలను చైతన్యవంతం చేయుట జరిగిందని ఆయన తెలిపారు.
గ్రామాల్లో పారిశుద్ధ్య సిబ్బందిచే ముందస్తు కిటక నియంత్రణ చర్యలు చేపట్టుట ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యంగా ఆయన చెప్పారు.
ఇదిలావుండగా, వారానికోరోజు ప్రతీ శుక్రవారం ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని జిల్లాలోని అన్ని గ్రామాల్లో నిర్విరామంగా నిర్వహిస్తున్నామని ప్రసాద్ చెబుతూ, ఈ కార్యక్రమం ఎంతో విజయవంతంగా సాగుతోందన్నారు. ఈ కార్యక్రమం తో గ్రామ గ్రామానా ఆరోగ్య అవగాహనను ఆరోగ్య, ఆశా కార్యకర్తలు ఇంటింటికి స్వయంగా వెళ్లి ప్రజలకు తెలియజేబుతున్నారని చెప్పారు. దీంతో ప్రజలు సైతం ఆరోగ్య పరంగా ఎంతో చైతన్యవంతులవుతున్నారని జిల్లా మలేరియా అధికారి ప్రసాద్ వివరించారు.