ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్ సంచ‌ల‌న ఆదేశాలు జారీ చేశారు. పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డిని ఈ నెల 21 వ‌ర‌కు ఇంటికే ప‌రిమితం చేయాల‌ని, ఇంటి నుంచి బ‌య‌ట‌కు రాకుండా చూడాల‌ని డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. మీడియాతో కూడా మాట్లాడ‌కుండా చూడాల‌ని ఆదేశించారు. ఎన్నిక‌లు స‌జావుగా జ‌రిపేందుకు, ప్ర‌జ‌లు నిర్భ‌జంగా ఓటేసేందుకు ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలిపారు.

ఒక మంత్రిని ఇంటికే ప‌రిమితం చేయాల‌ని ఎస్ఈసీ ఆదేశించ‌డం సంచ‌ల‌నానికి దారి తీస్తోంది. నిన్న పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి చేసిన వ్యాఖ్య‌ల‌పై ఎస్ఈసీ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. పెద్దిరెడ్డి వ్యాఖ్య‌లు ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు విఘాతం క‌లిగిస్తాయ‌ని భావించిన ఎస్ఈసీ ఇటువంటి క‌ఠిన నిర్ణ‌యం తీసుకున్నారు. నిన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిరుప‌తిలో మీడియాలో మాట్లాడుతూ ప‌లు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే.

నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్ మాట‌లు విని ఎవ‌రైనా అధికారులు నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా, ఏక‌ప‌క్షంగా ప్ర‌వ‌ర్తిస్తే వారిపై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని, అటువంటి అధికారులను త‌మ ప్ర‌భుత్వం ఉన్న‌న్ని రోజులూ బ్లాక్ లిస్టులోనే పెడ‌తామ‌ని పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు. ఏక‌గ్రీవాల‌ను నిలిపివేసే అధికారం నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్‌కు లేద‌ని ఆయ‌న పేర్కొన్నారు. కేవ‌లం టీడీపీని బ‌తికించ‌డానికే నిమ్మ‌గ‌డ్డ ప‌ని చేస్తున్నార‌ని పెద్దిరెడ్డి ఆరోపించారు.