త‌మ దేశాల‌కు క‌రోనా వ్యాక్సిన్ అవ‌స‌రం లేద‌ని రెండు ఆఫ్రికా దేశాలు ప్ర‌క‌టించాయి. ఇటీవ‌ల క‌రోనా వ్యాక్సిన్ల ప‌ట్ల టంజానియా దేశాధ్య‌క్షుడు అనుమానం వ్య‌క్తం చేశారు. తమ దేశం దేవుడి ద‌య‌తో ఇప్ప‌టికే క‌రోనా వ్యాక్సిన్‌ను జ‌యించామ‌ని, ఇక తమ దేశానికి వ్యాక్సిన్‌ల అవ‌స‌రం లేద‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. అయితే, వ్యాక్సిన్ తీసుకోవాల‌ని, దేశ‌పౌరుల‌కు అందించాల‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ టంజానియాకు సూచించింది.

టంజానియాకు తోడుగా ఇప్పుడు ఆ దేశం ప‌క్క‌నే ఉండే బురుండి అనే మ‌రో ఆఫ్రికా దేశం కూడా త‌మ‌కు వ్యాక్సిన్ అవ‌స‌రం లేద‌ని స్ప‌ష్టం చేసింది. 95 శాతం మంది క‌రోనా బాధితులు పూర్తిగా కోలుకుంటున్న నేప‌థ్యంలో త‌మ దేశానికి ఇక వ్యాక్సిన్ అవ‌స‌రం లేద‌ని ఆ దేశ ఆరోగ్య‌శాఖ మంత్రి ప్ర‌క‌టించారు. వ్యాక్సిన్‌పై ఆధార‌ప‌డ‌టం కంటే క‌రోనాను నియంత్రించ‌డ‌మే మేల‌ని తాము భావిస్తున్న‌ట్లు ఆయ‌న తెలిపారు.

కాగా, క‌రోనా వ్యాక్సిన్ ధ‌నిక దేశాల‌కు ముందుగా అందుబాటులోకి వ‌చ్చింది. ఆ త‌ర్వాత అభివృద్ధి చెందుతున్న దేశాల ప్ర‌జ‌ల‌కు అందుతోంది. ఇప్పుడు ఆఫ్రికా స‌హా ప‌లు పేద దేశాలకు వ్యాక్సిన్ స‌ర‌ఫ‌రా ప్రారంభ‌మ‌వుతోంది. ఇటువంటి స‌మ‌యంలో ఈ రెండు దేశాలు అస‌లు త‌మ పౌరులకు వ్యాక్సిన్ అవ‌స‌ర‌మే లేద‌ని, స‌హ‌జంగానే తాము క‌రోనాను జ‌యిస్తామ‌ని చెప్ప‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.