పంచాయతీ ఎన్నిక‌ల్లో వార్డు స‌భ్యుడిగా పోటీ చేస్తున్న అభ్య‌ర్థిని పోటీ నుంచి త‌ప్పుకోవాల‌ని బెదిరించార‌నే ఆరోప‌ణ‌ల‌పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన య‌ల‌మంచిలి ఎమ్మెల్యే క‌న్న‌బాబు రాజును పోలీసులు అరెస్టు చేశారు. అనంత‌రం ఆయ‌న‌ను స్టేష‌న‌ల్ బెయిల్‌పై విడుద‌ల చేసి పంపించారు.

త‌న నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని పంచాయ‌తీల‌ను ఏక‌గ్రీవం చేసుకోవాల‌ని తాప‌త్ర‌య ప‌డిన ఎమ్మెల్యే క‌న్న‌బాబు రాజు మొద‌టి విడత నామినేష‌న్ల సంద‌ర్భంగా వార్డు స‌భ్యుడిగా పోటీ చేస్తున్న అభ్య‌ర్థి అల్లుడికి ఫోన్ చేశారు. పోటీ నుంచి త‌ప్పుకోవాల‌ని సూచించారు. ఇందుకు సంబంధించిన ఆడియో వైర‌ల్‌గా మారింది.

పోటీ చేస్తే కేసులు పెట్టి అరెస్టు చేయిస్తాన‌ని సైతం కన్న‌బాబు రాజు హెచ్చ‌రించారు. దీంతో స‌ద‌రు అభ్య‌ర్థి ఎమ్మెల్యేపై పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌గా, కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ఇవాళ ఎమ్మెల్యేను అరెస్టు చేశారు. అయితే, త‌న వాయిస్‌ను క‌ట్ పేస్ట్ చేసి త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని, ఏక‌గ్రీవ‌మైతే గ్రామం అభివృద్ధి చెందుతుంద‌ని మాత్ర‌మే తాను చెప్పాన‌ని క‌న్న‌బాబు రాజు అంటున్నారు.