సోమాలియా దేశ రాజధానిలో ఒక రెస్టారెంటులోకి బాంబులతో నింపిన కారును తోలించి బ్లాస్ట్ చేశారు. కారు బాంబు పేలుడుతో దద్దరిల్లింది. ఈ పేలుడులో 20 మంది సామాన్య జనం దుర్మరణం పాలయ్యారు. సమీప ప్రాంతాలన్నీ బాంబు పేలుడు తాకిడికి కంపించిపోయాయి. ఈ పేలుడు వెనుక అల్ ఖైదా తీవ్రవాద సంస్థ కుట్ర వుందని ప్రాథమిక సమాచారం అందింది.

సోమాలియా రాజధాని మోగదిషులో శనివారం (మార్చి 6న) మధ్యాహ్నం జరిగిన ఈ బాంబు దాడిలో సుమారు 30 మందికి గాయాలు కాగా వారిని లోకల్ హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. బాంబు దాడి వెనుక అల్‌-షహబ్‌ సంస్థ హస్తం ఉందని సోమాలియా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

అల్‌-షహబ్‌ సంస్థకు గత రెండు దశాబ్ధాలుగా ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దారుణాలకు, పేలుళ్ళకు, హత్యాకాండలకు పాల్పడిన అల్‌ఖైదా ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్నట్లు గుర్తించారు. సోమాలియా దేశంలో జరగాల్సిన ఎన్నికలపై ప్రతిపక్ష కూటమి శనివారం మొగాదీషులో సమావేశం కావల్సిన తరుణంలో బాంబు పేలుడు ఘటనతో ఆ సమావేశాన్ని వాయిదా వేశారు. ఈ దారుణ ఉదంతం త్వరలో జరగనున్న ఎన్నికలపై ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. సోమాలియాలో తాజాగా సంభవించిన కారు బాంబు పేలుడు దుర్ఘటనను పలు దేశాలు తీవ్రంగా ఖండించాయి.