గడిచిన 24 గంటల్లో 7,51,935 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే 18,327 కొత్త కేసులు వెలుగుచూశాయని శనివారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గతేడాది సెప్టెంబర్ నుంచి తగ్గుముఖం పట్టిన కేసులు మళ్ళీ కొన్ని వారాలుగా పెరగడం కంగారు పుట్టిస్తుంది. ఏరోజుకారోజు 20వేలకు చేరువగా పాటిజివ్ కేసులు నమోదవుతుండటం కలవరపెడుతోంది. రెండవ రోజు కూడా వంద మరణాలు దాటడం ఆందోళనకర అంశం. ఇప్పటివరకు మొత్తంగా 1.11 కోట్ల మందికి పైగా వైరస్ బారిన పడితే 1,57,656 మరణాలు సంభవించాయి.

ప్రస్తుతం దేశంలో క్రియాశీల కేసులు లక్షా 80వేలకు పైబడ్డాయి. ఆ రేటు 1.61 శాతానికి పెరిగింది. ఈ మధ్యకాలంలో 97 శాతాన్ని దాటిన రికవరీ రేటు ఇప్పుడు 96.98 శాతానికి పడిపోవయింది. నిన్న 14,234 మంది కొవిడ్‌ నుంచి కోలుకోగా మొత్తంగా వైరస్‌ను జయించినవారి సంఖ్య 1,08,54,128కి చేరింది. ప్రజల నిర్లక్ష్య ధోరణే కరోనా విజృంభణకు కారణమని నిపుణులు అంటున్నారు.

మరోవైపు, దేశంలో కరోనా టీకా కార్యక్రమం సజావుగా కోనసాగుతోంది. దేశవ్యాప్తంగా టీకాలు తీసుకున్న వారి సంఖ్య రెండు కోట్లకు దగ్గరవుతుంది. రెండు దశల్లో భాగంగా మార్చి ఐదు నాటికి, 1,94,97,704 మందికి కేంద్రం టీకాలు అందించింది. నిన్న అత్యధికంగా 14,92,201 మంది టీకాలు వేయించుకున్నారు.