గతంలో హైదరాబాద్ కు డబుల్ డెక్కర్ బస్సులు ఒక ఆకర్షణగా ఉండేవని ప్రజలకు తెలుసు! ఇప్పుడు మళ్ళీ మరికొన్ని రోజుల్లో హైదరాబాద్ రోడ్లపై ఆర్టీసీ డబుల్ డెక్కర్ బస్సులు పరుగులు పెట్టనున్నాయి. హైదరాబాద్‌లో సుదీర్ఘ విరామం తర్వాత నడిపేందుకు నిర్ణయించిన డబుల్ డెక్కర్ బస్సుల కోసం ప్రభుత్వం టెండర్లకు ఆహ్వానించింది. గతంలో తిరిగిన డబుల్ డెక్కర్ బస్సులతో పోలిస్తే సాంకేతిక పరంగా మంచి సామర్థ్యం ఉన్న ఇంజిన్ మరియు హైదరాబాద్ రోడ్లకు అనువైన బస్సు బాడీ వంటివి ఉండాలని ఆర్టీసీ సంస్థ టెండర్ దాఖలు సమయంలోనే స్పష్టం చేసింది.
టెండర్లలో పాల్గొన్న అశోక్ లేలాండ్ ఆర్టీసీ కోరినట్లుగా అన్ని సదుపాయాలతో బస్సులను సమకూరుస్తామని చెప్పింది. మొదటి దశలో 25 బస్సులు కావాలని కోరగా అదే విధంగా అందజేస్తామని సంస్థ పేర్కొంది. మరో రెండు రోజుల్లో ఆర్థిక కమిటీ సమావేశమై బస్సుల ధరపై చర్చించి టెండర్‌కు ఆమోద ముద్ర వేసే అవకాశముంది.
అయితే బీఎస్-6 ప్రమాణాల మేరకు బస్సులను తయారు చేయాలంటే ఖర్చుల అంచనాలు తయారు చేసేందుకు మరింత సమయం కావాలని కోరటంతో టెండర్ల గడువును అధికారులు ఇటీవల పొడిగించారు. అయితే చివరకు అశోక్ లేలాండ్ సంస్థ మాత్రమే టెండరు దాఖలు చేసింది. ఆ సంస్థతో ఆర్టీసీ అధికారులు చర్చించైనా కూడా ఒక్కో బస్సు తయారు చేసేందుకు ఆ సంస్థ ఎంత మొత్తాన్ని కోట్ చేసిందన్నది తెలియరాలేదు.