వార్తలు (News)

జేగురుపాడు జివికె మినీ జూలో పర్యవేక్షణ లోపం

ఒకపక్క దేశమంతటా వన్యప్రాణుల వారోత్సవాలు జరుగుతుంటే తిండి,నీళ్లు లేక తూ.గో.జిల్లా కడియం మండలం జేగురుపాడు జివికె పవర్ ప్రాజెక్ట్ మినీ జూ లో జింకలు,నెమళ్ళు వంటివి నీటి ఎద్దడితో అల్లాడుతున్నాయి.ఈ ప్రాజెక్ట్ ఏర్పడిన మూడు దశాబ్దాల కాలం నుంచి నిర్వహించబడుతున్న ఈ జూ లో ప్రస్తుతం పక్షులకు గడ్డు కాలం నడుస్తుంది. కరోనా వల్ల ఈ జూ లోకి సందర్శకులు రానీయకుండా నిలుపుదల చేసారు. అదే ఈ వన్యప్రాణులకు శాపంగా మారింది. ఖరీదైన రెండు హంసలుతో పాటు నెమళ్ళు (తెల్ల నెమలి కూడా),జింకలు, కొండచిలువలుతో పాటు అనేక అరుదైన పక్షులు, జంతువులు ఈ జూలో ఉండేవి. కానీ కాల క్రమేణ చాలా వరకూ కనుమరుగవ్వగా, ఉన్నవాటికి కూడా సంరక్షణ లేకుండా పోయింది.


ఇటీవల కుక్క కరిచి 28 జింకలు మృతి చెందాయని నిర్వాహకులు చెబుతున్నారు. అవి ఎలా చనిపోయాయని నిర్దారించిన అధికారి ఎవరూ లేరు. ప్రస్తుతం 52 జింకలు ఈ జూలో ఉండగా వాటికి గడ్డి వేసే నాధుడు లేడు.అంతెందుకు ఈ వన్యప్రాణులకు నీరు అందించే విద్యుత్ మోటార్ మరమ్మత్తులకు వచ్చి పదిరోజులైనా బాగు చేసేవారు లేరు.దీంతో నెమళ్ళు ఇతర పక్షులు త్రాగు నీరులేక అల్లాడుతున్నాయి.

 ఈ జూలో వన్యప్రాణుల పరిస్థితిని జేగురుపాడు సర్పంచ్ యాదల సతీష్ చంద్ర స్టాలిన్ రాజమహేంద్రవరం ఎంపి మార్గాని భరత్ రామ్ దృష్టికి తీసుకెళ్లడంతో అయన ఈ జూను అధికారులతో కలసి పరిశీలించి  అటవీశాఖ అధికారులు ప్రమేయం లేకుండా ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేసారు.తక్షణమే వీటికి సంరక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించడంతో అధికారులు పరుగులు పెడుతున్నారు.ఇప్పటికైనా ఈ జూ కి పూర్వవైభవాన్ని తోసుకురావలని వన్యప్రాణుల ప్రేమికులు కోరుతున్నారు. కనీసం నీటి సమస్య తీరినా కూడా ఆ మూగ జీవాలు మరికొంత కాలం ఊపిరి పోసుకుంటాయి.
close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.