అంగారకుడిపైకి నాసా ప్రయోగించిన రోవర్‌ ‘పర్సెవరెన్స్‌’ తొలిసారి విజయవంతంగా ‘టెస్ట్‌ డ్రైవ్‌’ చేపట్టింది. ఈ కీలక ముందడుగు గురించి అమెరికా అంతరిక్ష పరిశోధన కేంద్రం నాసా శుక్రవారం వెల్లడించింది. ఈ ‘ఆరు చక్రాలు కలిగిన రోవర్‌ ‘పర్సెవరెన్స్‌’ అంగారకుడిపై విజయవంతంగా ప్రయాణం (టెస్ట్‌ డ్రైవ్‌) చేసింది. 33 నిమిషాల వ్యవధిలో 6.5 మీటర్ల (21.3ఫీట్‌) దూరం అనగా నాలుగు మీటర్లు ముందుకు ప్రయాణించి, 150 డిగ్రీల ఎడమవైపునకు తిరిగి వెనక్కి మరో 2.5 మీటర్లు ప్రయాణించింది. ఇందుకు సంబంధించి రోవర్‌ పంపిన చిత్రాల్లో అది తిరిగిన ప్రదేశాల్లో ట్రాక్‌ జాడలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

రోవర్‌ చక్రాలను నడిపించేందుకు ఇది మాకు లభించిన తొలి అవకాశం అని అంగారకుడిపై రోవర్‌ ప్రయాణించిన తీరు అద్భుతం అని ఈ మిషన్‌లో ఇదో కీలక మైలురాయిగా నిలుస్తుందని, ఇది కేవలం ఆరంభం మాత్రమే అని, త్వరలో రోవర్‌తో కొన్ని దూర ప్రయాణాలు కూడా చేయించనున్నాం అని, అంగారకుడి ఉపరితలంపై అది తిరగడానికి అవకాశం ఉన్న ప్రదేశాలపై పరిశోధిస్తున్నాం అని పర్సవరెన్స్‌ మొబిలిటీ టెస్ట్‌ బెడ్‌ ఇంజినీర్‌ అనైస్‌ జరిఫ్యాన్‌ వెల్లడించారు.

అసలు నాసా చేపట్టిన మార్స్‌ మిషన్‌లో ఇప్పటి వరకు పెద్దగా ఎలాంటి అవరోధాలు ఎదుర్కోలేదు. పూర్తయినంత వరకూ అద్భుతంగానే జరిగింది’ అని పర్సవరెన్స్‌ డిప్యూటీ మిషన్‌ మేనేజర్‌ రాబర్ట్‌ హాగ్‌ తెలిపారు

అంగారక గ్రహంపై జీవం పుట్టుక గురించి పరిశోధించేందుకు అమెరికాకు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ 2020లో రోవర్‌ను పంపిన విషయం తెలిసిందే. ఆ రోవర్‌ గతనెల 18న అంగారకుడిపై విజయవంతంగా కాలు మోపింది. రాబోయే రోజుల్లో మార్స్‌పై ఉండే రాళ్లు, మట్టి నమూనాలను రోవర్‌ సేకరించి భూమికి పంపుతుందని నాసా గతంలో తెలిపిందనే విషయం తెలిసిందే!