ఒడిశాలోని సోనేపుర్‌లో పుట్టింటిని వదల్లేక అప్పగింతల సమయంలో ఎక్కువగా ఏడ్చి గుండెపోటుతో ఒక నవ వధువు ప్రాణాలు కోల్పోయింది. అప్పటిదాకా పెళ్లి వేడుకలతో కళకళలాడిన ఆ ఇంట్లో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి.

జులుందా గ్రామానికి చెందిన గుప్తేశ్వరి సాహూ అలియాస్‌ రోజీకి బాలాంగిర్‌ జిల్లా తెటెల్‌గావ్‌ గ్రామానికి చెందిన బిశికేశన్‌తో వివాహం నిశ్చయమై శుక్రవారం వీరి పెళ్లి ఘనంగా జరిగింది. వేడుకల అనంతరం వధువు కుటుంబసభ్యులు కూతుర్ని అత్తవారింటికి సాగనంపేందుకు ‘బిదాయి(అప్పగింతలు)’ జరుపుతుండగా రోజీ ఏడుస్తూనే ఉంది. అలా ఏడ్చిఏడ్చి ఉన్నట్టుండి కుప్పకూలింది. దీంతో ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు ఆమెను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే గుండెపోటుతో రోజీ ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు వెల్లడించారు.