ఏపీలో ఈ నెల 8న పరిషత్ ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తుండడంతో ఈ నెల 8వ తేదీతో పాటు, 7వ తేదీన కూడా సెలవుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 7వ తేదీన ఎన్నికల ఏర్పాట్ల నిమిత్తం సెలవు ఇస్తున్నట్టు, రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ రెండ్రోజుల పాటు ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లు, సంస్థలకు, దుకాణాలకు, వాణిజ్య సంస్థలకు సెలవు ఉంటుందని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఏపీపీఆర్‌ యాక్ట్‌ 225ఏ ప్రకారం ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ముందస్తుగా 48 గంటల పాటు మద్యం అమ్మకాలను నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. నేగోషియబుల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ యాక్ట్‌ 1881 ప్రకారం జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఏప్రిల్‌ 8వ తేదీన సెలవుదినంగా ప్రభుత్వం ప్రకటించింది. ఏపీ షాప్స్‌ అండ్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ యాక్ట్‌ 1988 ప్రకారం 8వ తేదీని ఉద్యోగులు, కార్మికులకు వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించింది. కోవిడ్‌-19 నిబంధనలు పాటిస్తూ ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆదేశించారు.