ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను నిలిపివేస్తూ ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎస్ఈసీ నోటిఫికేషన్ ప్రకారం ఈనెల 8న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ జరిగి 10న ఓట్ల లెక్కింపు చేపట్టాల్సి ఉంది. గత ఏడాది జారీ చేసిన నోటిఫికేషన్‌కు అనుగుణంగా ఆగిన చోట నుంచే పరిషత్ ఎన్నికలను చేపట్టనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. నామినేషన్ల ప్రక్రియ గతంలోనే ముగియడంతో కేవలం పోలింగ్, లెక్కింపు ప్రక్రియలు మాత్రమే మిగిలి ఉన్నాయి. తాజాగా ఎన్నికల తేదీలు ప్రకటించిన నాటి నుంచి వారంలోపే పోలింగ్ జరగాల్సి ఉండటంతో అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. నేటితో ప్రచారం గడువు కూడా ముగియనుంది.
ఈ తరుణంలో ఎస్ఈసీ తాజాగా జారీ చేసిన నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ తెదేపా, భాజపా, జనసేన వేసిన పిటిషన్లపై ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. పోలింగ్‌కు నాలుగు వారాల ముందు ఎన్నికల కోడ్ అమలు కావాలంటూ సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన విషయాన్ని పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లి ఆ నిబంధనలను బేఖాతరు చేస్తూ పదవీ బాధ్యతలు చేపట్టగానే ఎస్ఈసీ తాజాగా నోటిఫికేషన్ ఇవ్వడం.. వెంటనే ఎన్నికల ప్రక్రియ ప్రారంభించారనే అభ్యంతరాలను హైకోర్టు ముందుంచారు. ప్రధానంగా సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయకపోడాన్ని ప్రస్తావించారు. దీనిపై ప్రభుత్వం, ఎస్ఈసీ తరఫు న్యాయవాది స్పందిస్తూ సుప్రీంకోర్టు నాలుగు వారాలు అని స్పష్టంగా చెప్పలేదని కోర్టుకు తెలిపారు. ఇరువురి వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు పరిషత్ ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.