కొడుకులు పున్నామ నరకం నుంచి తప్పిస్తారని ప్రతి ఒక్కరూ కొడుకులు కావాలని తపిస్తూ ఉంటారు. కానీ కొంతమంది కొడుకులు పున్నామ నరకం నుంచి తప్పించడం మాట అటుంచితే బ్రతికి ఉండగానే నరకం చూపిస్తారు. అలాంటి ఒక తండ్రి కథ ….

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా ఆలంపూర్‌ మండలం పుల్లూరుకు చెందిన స్వామి(62)కి ఇద్దరు కుమారులు ఉన్నారు. తన స్వగ్రామంలో ఉన్న ఎకరం పొలం అమ్మిన స్వామి ఆ సొమ్ముతో హైదరాబాద్‌ నార్సింగ్‌లో ఇల్లు కట్టుకుని కుమారులతోపాటు ఉంటూ ఇద్దరికీ పెళ్లిళ్లు చేశారు. వారిద్దరూ ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగాలు చేస్తుండగా, కోడళ్లు ఉపాధ్యాయినిలుగా విధులు నిర్వహిస్తున్నారు. చీటికి మాటికి కోడళ్లను కసురుకుంటున్నాడనే నెపంతో కన్నతండ్రిపై కోపం పెంచుకున్న కుమారులు కూడబలుక్కుని మళ్లీ ఇంటికి రాలేనంత దూరంలో ఆయన్ను వదిలేయాలని నిర్ణయించుకుని ద్విచక్ర వాహనంపై ఎక్కించుకొని నాలుగు రోజుల కిందట అనంతగిరి అడవిలో వదిలేసి వచ్చారు.

ఎలాగో అక్కణ్నుంచి బయటపడిన స్వామి అనంతగిరి నుంచి వికారాబాద్‌ వైపు నడుచుకుంటూ వచ్చి న్యాయస్థానం సమీపంలో ఉన్న హోటల్‌ యజమాని మహ్మద్‌గౌస్‌ దగ్గరికి వెళ్లి తాగడానికి నీళ్లు అదిగడంతో ఒంటిపై సరైన దుస్తులు లేకుండా, నిస్సత్తువగా ఉన్న ఆయనపై జాలిపడిన గౌస్‌ నీళ్లతోపాటు భోజనమూ పెట్టాడు. ఆ తర్వాత వివరాలు అడిగి తెలుసుకుని మూడు రోజులుగా తన హోటల్‌లోనే ఆశ్రయమిచ్చారు. సోమవారం హోటల్‌కు వచ్చిన వినియోగదారుడు ఇచ్చిన సమాచారం మేరకు వికారాబాద్‌ ఎస్‌ఐ-2 కోటేశ్వరరావు వృద్ధుడిని విచారించి వాంగ్మూలం నమోదు చేసిన అనంతరం వికారాబాద్‌ పురపాలక సంఘం పరిధిలోని ‘మహిత మినిస్ట్రీస్‌’ అనాథ ఆశ్రమంలో చేర్పించారు. ఆయన తెలిపిన వివరాల ఆధారంగా కుమారులను విచారించి, అనంతరం వారిపై కేసు నమోదు చేస్తామని ఎస్‌ఐ వివరించారు.