కడప జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్‌ ఐటీ ఆర్కే వ్యాలీలో ఇంజినీరింగ్‌ నాలుగో సంవత్సరం విద్యార్థులు ర్యాగింగ్‌ చేశారంటూ మూడో సంవత్సరం విద్యార్థులు నిరసనకు దిగారు. ఈ నేపథ్యంలోనే ప్రసాద్‌ చంద్ర, తేజ, వంశీ, చరణ్‌, శివాజీ సహా మరికొందరు నాలుగో సంవత్సరం విద్యార్థులు జూనియర్ల వసతి గృహానికి వెళ్లి తమ వెంట తీసుకెళ్లిన క్రికెట్‌ బ్యాట్లు, సైకిల్‌ చైన్లు, ఇతర వస్తువులతో మూకుమ్మడిగా దాడి చేశారు. అధికారులు సర్దిచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ సీనియర్లు లెక్కచేయకుండా దాడికి పాల్పడినట్లు, ఈ ఘర్షణలో మూర్తి, శేషు, రాజు అనే ముగ్గురు జూనియర్లను గాయపరచినట్టు సిబ్బంది తెలిపారు. తరువాత వారిని హుటాహుటిన స్థానిక ఆర్కే వ్యాలీ ఆసుపత్రికి తరలించారు.