తెలుగు రాష్ట్రాలలో త్రాగునీటిలో ఆర్సెనిక్ మూలాలు ప్రమాణాలకంటే అధికంగా ఉన్నట్టు గుర్తించారు. భూగర్భ జలాలను అధికంగా తోడేస్తుండటంవల్ల కొన్ని ప్రాంతాల్లో జలమట్టం ప్రమాదకర స్థాయికి పడిపోవడంతో భూగర్భ జలాల్లో విషపూరితమైన ఆర్సెనిక్‌ మూలాలు కన్పిస్తున్నాయి. బీఐఎస్‌ (బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌) ప్రమాణాల ప్రకారం లీటర్‌ నీటిలో 0.01 మిల్లీ గ్రాములోపు వరకు ఆర్సెనిక్‌ మూలాలు ఉండొచ్చు.

కానీ.. గుంటూరు జిల్లాలో, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో, తెలంగాణలోని ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో రెండుచోట్ల భూగర్భ జలాల్లో బీఐఎస్‌ ప్రమాణాల కంటే అధికంగా ఆర్సినిక్‌ మూలాలున్నాయని, ఈ నీటిని తాగినా, ఆ నీటితో సాగుచేసిన పంటల ఉత్పత్తులను తిన్నా మనుషులు, పశువుల జీర్ణ, శ్వాసకోస వ్యవస్థ చెడిపోతుందని, బోన్‌మ్యారో (ఎముక మజ్జ), చర్మ క్యాన్సర్‌ బారినపడే అవకాశం ఉంటుందని వైద్య, ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.