రివ్యూ రాజా (Review Raja) వార్తలు (News) వినోదం

ఎస్‌.ఆర్‌.క‌ళ్యాణ‌మండ‌పం రివ్యూ.. ఎలా ఉందంటే??

చిత్రం పేరు: ఎస్‌.ఆర్‌.కళ్యాణమండపం
న‌టీన‌టులు: కిర‌ణ్ అబ్బవ‌రం, ప్రియాంక జ‌వాల్కర్, సాయికుమార్, తులసి, అరుణ్ కుమార్, అనిల్ జీలా, కష్యప్ శ్రీనివాస్, త‌దిత‌రులు;
నిర్మాత‌లు: ప్రమోద్, రాజు; క‌థ‌,
క‌థ‌నం, సంభాష‌ణ‌లు: కిర‌ణ్ అబ్బవరం;
ద‌ర్శకుడు: శ్రీధ‌ర్ గాదే;
సంగీతం: చేత‌న్ భ‌ర‌ద్వాజ్;
ఛాయాగ్రహ‌ణం: విశ్వాస్ డేనియ‌ల్;
పాట‌లు: భాస్కరభ‌ట్ల, క్రిష్ణ కాంత్;
క‌ళ‌: సుధీర్‌;
నిర్మాణ సంస్థ: ఎలైట్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌;
విడుద‌ల సంస్థ: శంక‌ర్ పిక్చర్స్;
విడుద‌ల తేదీ: 06-08-2021

కరోనా నేపథ్యంలో థియేటర్ లు తెరిచినతరువాత రెండవ శుక్రవారం విడుదలైన ప‌రిమిత వ్యయంతో రూపొందిన‌ చిత్రం ‘ఎస్‌.ఆర్‌.క‌ళ్యాణ‌మండ‌పం’. ఇప్పటికే ప్రచార చిత్రాలు ఆక‌ట్టుకోవ‌డం, తొలి సినిమా ‘రాజావారు రాణిగారు’తో మెప్పించిన కిర‌ణ్ అబ్బవ‌రం రెండో సినిమా కావ‌డంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ చిత్రం అందుకు త‌గ్గట్టే ఉందో లేదో చూద్దాం!

కథా కమామీషు: ఆ ఊళ్లో ఎస్‌.ఆర్‌.క‌ళ్యాణ‌మండ‌పానికి ఒక చ‌రిత్ర. తండ్రి మ‌ర‌ణం త‌ర్వాత త‌న‌యుడు ధ‌ర్మ (సాయికుమార్‌) ఆ మండ‌పం బాధ్యత‌ల్ని తీసుకోగా కాల‌క్రమంలో మండ‌పం వైభ‌వం త‌గ్గుతుంది. దానికి కార‌ణం ధ‌ర్మనే అని ఊళ్లోవాళ్లు చెప్పుకుంటుంటారు. భార్య శాంతి(తుల‌సి)తో ధ‌ర్మకి ఎప్పుడూ త‌గ‌వులే. దాంతో తాగుడుకి బానిస‌వుతాడు. ధ‌ర్మ త‌న‌యుడు క‌ళ్యాణ్ (కిర‌ణ్ అబ్బవ‌రం) కూడా త‌న తండ్రితో మాట్లాడ‌టం మానేస్తాడు. తాక‌ట్టు వ‌ర‌కు వెళ్లిన ఎస్‌.ఆర్.క‌ళ్యాణ‌మండపానికి పూర్వవైభ‌వం తీసుకొచ్చే బాధ్యత క‌ళ్యాణ్‌పై ప‌డడంతో అందులో క‌ళ్యాణ్ విజ‌యం సాధించాడా లేదా? అనేదే సినిమా కథ.

ప్రేక్షకుల మాట: కడ‌ప జిల్లా రాయ‌చోటి ప‌ట్టణం. అందులోని ఎస్‌.ఆర్‌.క‌ళ్యాణ‌మండ‌పం నేప‌థ్యంలో సాగే ఈ క‌థ.. క‌థానాయ‌కుడు కిర‌ణ్ అబ్బవ‌రం స్వయంగా రాసుకున్నారు. యువ‌త‌రాన్ని అల‌రించే హాస్యం, భావోద్వేగాలతోపాటు ఇత‌ర‌ వాణిజ్యాంశాలకి కూడా ఈ చిత్రంలో చోటుంది. ఒక చిన్న పట్టణం, అందులో ఓ చ‌రిత్ర ఉన్న క‌ళ్యాణ‌మండపం నేప‌థ్యం కూడా వినూత్నమైన‌ కథగానే చెప్పవచ్చు. క‌థ‌, మాట‌ల వ‌ర‌కు బ‌లంగా క‌నిపిస్తున్నప్పటికీ సినిమా నిర్మాణంలోకి వచ్చే సరికి పలు లోపాలు చోటు చేసుకున్నాయి. ప్రథ‌మార్ధంలో భావోద్వేగాలు, వినోదం, మ‌లుపులు ఫ‌లితాన్నిచ్చాయి కానీ.. ద్వితీయార్ధంలో కథ చెప్పే తీరులో దర్శకుడు తడబడడంతో, సినిమా మొత్తం ప్రేమ‌క‌థ‌లో బ‌లం లేక సాగ‌దీత‌ వ్యవ‌హారంలా మారిపోయింది. ప్రథ‌మార్ధం కాలేజీ గొడ‌వ‌లు, ప్రేమ స‌న్నివేశాల‌తో స‌ర‌దాగా సాగిపోతుంది. క‌ళ్యాణ‌మండ‌పం బాధ్యత‌లు మీద ప‌డ‌టంతో హీరో, అత‌ని మిత్రబృందం తెలివితేట‌లు జోడించి పెళ్లిళ్లు చేయాల‌ని నిర్ణయించ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తుంది. పెళ్లిళ్లు గతంలో ఎలా జ‌రిగేవి, ఇప్పుడెలా జ‌రుగుతున్నాయో హీరో చెప్పడం ఆక‌ట్టుకుంటుంది. కానీ, ఆ త‌ర్వాత వ‌చ్చే స‌న్నివేశాలే అందుకు త‌గ్గట్టుగా లేక‌పోవ‌డంతో క‌ళ్యాణ‌మండ‌పం క‌ళ తప్పిపోయింది. ఒక్క పెళ్లి కూడా ఆ మాట‌ల‌కి త‌గ్గట్టుగా చేయ‌లేక‌పోతుంది హీరో, అత‌ని మిత్రబృందం. ఊరి చివ‌ర జ‌రిగే ఊరేగింపుల్ని, ఒక పెళ్లి పెద్దతో అన్నం వ‌డ్డించ‌డం వంటి స‌న్నివేశాల్ని చూపించ‌డం మిన‌హా పెద్దగా చేసింది ఏమి లేదు. పెళ్లిమండ‌పం ఓ ప్రధాన పాత్రగా మారాల్సి ఉన్నా బోర్డుని తప్ప మరేమీ చూపెట్టకపోవడం నిరాశ కలిగిస్తుంది. తండ్రీ కొడుకుల బంధం ప్రధానంగా సాగే ఈ సినిమా ప‌తాక స‌న్నివేశాలు కూడా అంట ప్రభావం చూపించలేకపోయాయి. ఈ క‌ళ్యాణ‌మండ‌పంలో పేరు రిజిస్టర్ అయితే చాలు.. పెళ్లి జ‌ర‌గాల్సిందే అని హీరో చెప్పడం, విరామానికి ముందు వ‌చ్చే మ‌లుపు కూడా ద్వితీయార్ధంపై ఆస‌క్తిని రేకెత్తిస్తాయి. కానీ ద్వితీయార్ధంలో క‌థ పూర్తిగా గాడి తప్పింది.

ఎవరు ఎలా నటించారు: కిర‌ణ్ అబ్బవ‌రం, సాయికుమార్ పాత్రలు ఆక‌ట్టుకుంటాయి. ఆ పాత్రల్లో వారి న‌ట‌న కూడా మెప్పిస్తుంది. హీరో మిత్రబృందంలో కొత్తవాళ్లు కనిపించి వాళ్లు ప‌ర్వాలేద‌నిపిస్తారు. తుల‌సి, శ్రీకాంత్ అయ్యంగార్ చిన్న పాత్రల్లో క‌నిపిస్తారు. సాంకేతికంగా సినిమా బాగుంది. చేత‌న్ భ‌రద్వాజ్ పాట‌లు, నేప‌థ్య సంగీతం, డేనియ‌ర్ కెమెరా ప‌నిత‌నం చిత్రానికి ప్రధాన‌బ‌లంగా నిలిచాయి. ఒక క‌ళ్యాణ‌మండ‌పాన్ని కూడా చూపించ‌లేని స్థాయిలో నిర్మాణ విలువ‌లు ఉన్నాయి. ద‌ర్శకుడు శ్రీధ‌ర్ గాదే క‌థ‌పై ప‌ట్టుని ప్రద‌ర్శించ‌లేక‌పోయాడు.

బ‌లాలు

క‌థ‌, మాట‌లు, నేప‌థ్యం
కిర‌ణ్.. సాయికుమార్ న‌ట‌న
ప్రథ‌మార్ధం

బ‌ల‌హీన‌త‌లు
ద్వితీయార్ధం
ప్రేమ‌క‌థ‌లో బ‌లం లేక‌పోవ‌డం
చివ‌రిగా: క‌ళ తప్పిన క‌ళ్యాణ‌మండ‌పం

గమనిక: ఈ సమీక్ష వ్యక్తిగత అభిప్రాయమే!

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •